
కలెక్టర్‌ను కలిసిన మణుగూరు సింగరేణి అధికారులు
మణుగూరుటౌన్/సూపర్‌బజార్(కొత్తగూడెం): గతేడాది ఆగస్టు 30వ తేదీన గొర్రెపేటవాగు వరద, సింగరేణి నుంచి వచ్చిన వరద, భారీ వర్షం కారణంగా మణుగూరు జలదిగ్భందంలో చిక్కుకుంది. కాగా, ‘ముంపుపై ముందస్తు చర్యలేవి’అనే శీర్షికన ‘సాక్షి’లో గతేడాది మే 30న కథనం వచ్చింది. మణుగూరు మునకతో పట్టణంలోని ప్రధాన కాల్వలు, మొట్లు వాగు పూడిక తీయకపోవడం, సింగరేణి నుంచి వచ్చిన వరదలే ప్రధాన కారణంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ జితేశ్ పాటిల్ సూచన మేరకు సింగరేణి అధికారులు రూ.82.25 లక్షలతో శుక్రవారం ఎంఓయూ చేసుకున్నారు. ఈ నిధులను కట్టువాగు, మొట్ల వాగు పూడికతీత, మున్సిపాలిటీ ముంపునకు గురికాకుండా వినియోగించనున్నారు. కార్యక్రమంలో సంజీవరావు, ధనసరి వెంకటేశ్వర్లు, రమేశ్ పాల్గొన్నారు.
నేటి నుంచి సమ్మర్
కోచింగ్ క్యాంప్
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో నేటి నుంచి వేసవి శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు పర్సనల్ విభాగం జీఎం కవితానాయుడు తెలిపారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు 18 సంవత్సరాల లోపువారు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. శనివారం నుంచి మే 20వ తేదీ వరకు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం, సీఈఆర్ క్లబ్‌లో శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాక్సింగ్, ఉషు, కరాటే, డ్రాయింగ్ విభాగాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ ఉంటుందని, ఆసక్తి కలిగినవారు నేటి సాయంత్రం ప్రకాశం స్టేడియంలో పేర్లు నమోదు చేసుకోవాలని వివరించారు.