
పుస్తకాలు వస్తున్నాయ్..
● జిల్లాకు చేరిన మొదటి విడత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం క్లాత్ ● స్టిచ్చింగ్ పనులు చేపడుతున్న మహిళా సంఘాలు ● ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభంనాటికి అందించే అవకాశం
కొత్తగూడెంఅర్బన్: 2025–2026 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించే లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాకు మొదటి విడత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం క్లాత్ చేరుకుంది. పాఠ్యపుస్తకాలను జిల్లా కేంద్రంలోని పాతకొత్తగూడెం స్కూల్‌లో భద్రపరిచారు. మిగతా విడతల్లో కూడా వచ్చే పుస్తకాలను గోదాంలో ఉంచి, మే చివరిలోగా మండల కేంద్రాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు పంపించనున్నారు. పాఠశాలల పునఃప్రారంభంనాటికి విద్యార్థులకు కొత్త యూనిఫాం అందించనున్నారు. మొదటి విడతగా యూనిఫాం సంబంధించిన బాటమ్ క్లాత్ చేరుకోగా, మహిళా సంఘాల సభ్యులకు స్టిచ్చింగ్ నిమిత్తం అందజేశారు. వారు యూనిఫాం కుట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఏటా విద్యార్థులకు రెండు జతల యూనిఫాం అందజేస్తున్నారు. గతేడాది ఒక్కో యూనిఫాంకు స్టిచ్చింగ్ చార్జీ రూ.50 చొప్పున అందజేయగా, ఈసారి రూ.75కు పెంచారు. రెండు జతలు కుట్టినందుకు రూ.150 అందించనున్నారు. పట్టణాల్లో మెప్మా, మండలాల్లో సెర్ప్ సిబ్బంది స్టిచ్చింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారు. కాగా యూనిఫాం చొక్కాల క్లాత్ రెండో దశలో రానుందని అధికారులు తెలిపారు.
గోదాంకు చేరిన 1,10,200 పాఠ్యపుస్తకాలు
జిల్లాకు రానున్న విద్యాసంవత్సరంలో 5,08,400 పాఠ్యపుస్తకాలు అవసరం ఉంది. మొదటి విడతగా 1,10, 200 పుస్తకాలు చేరాయి. ఇంకా 3,98, 200 పుస్తకాలు రావాల్సి ఉంది. వచ్చిన పుస్తకాలను కొత్తగూడెం గోదాంలో భద్రపరిచారు. దీంతోపాటు మొదటి విడతలో యూనిఫాంలో ప్యాంట్‌కు సంబంధించిన క్లాత్ 2,50,060.45 మీటర్లు అందజేశారు.

పుస్తకాలు వస్తున్నాయ్..