రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య కల్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
వెదురుసాగుపై
అవగాహన కల్పించాలి
సెర్ప్ ఫార్మా డైరెక్టర్ రజిత
చుంచుపల్లి: జిల్లాలో వెదురు సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సెర్ప్ ఫార్మా డైరెక్టర్ రజిత సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ఐడీఓసీలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జరిగిన మిర్చి కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎఫ్‌పీసీల ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.కోటి టర్నోవర్ చేశారని, ఇంకా పెంచాలని అధికారులకు సూచించారు. గుండాల, ములకలపల్లి, చండ్రుగొండ మండలాల్లో ఎంతమంది వెదురు రైతులను గుర్తించారు, ఆన్‌లైన్‌లో ఎందరి డేటా ఎంట్రీ చేశారనే వివరాలపై ఆరా తీశారు. వెదురు సాగుతో కలిగే లాభాలతో పాటు సమీకృత వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. మునగ సాగు, మునగ ఆకుల సేకరణ ఎలా ఉందంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఎఫ్‌పీసీ కో– ఆర్డినేటర్ శ్రీనివాస్, టీపీఎం ఫార్మా వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్షలు, మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షలు (బ్యాక్‌లాగ్) ఈనెల 21నుంచి జరగాల్సి ఉంది. అయితే, వీటిని వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం వెల్ల డించారు. ఎక్కువ శాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీల విద్యార్థుల పరీక్ష ఫీజును యూనివర్సిటీకి చెల్లించకపోగా, నామినల్ రోల్స్ కూడా పంపలేదు. దీంతో పరీక్షలను వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని రాజేందర్ తెలిపారు.
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన


