‘భూ భారతి’తో సమస్యలు పరిష్కారం
గుండాల: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి కొత్త ఆర్‌ఓఆర్ చట్టంతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని, అన్ని రికార్డులు సక్రమంగా ఉన్న హక్కుదారులు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భూ భారతి చట్టంపై గురువారం ఆళ్లపల్లి, గుండాల మండల కేంద్రాల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్, సకాలంలో విచారణ చేస్తామని, అర్హులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. అన్నదమ్ముల భూ పంపకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉంటుందన్నారు. హక్కుల రికార్డుల్లో ఏమైనా తప్పులుంటే ఈ చట్టంతో సవరణ చేసుకునే అవకాశం ఉందన్నారు. కొన్నేళ్లుగా పెండింగ్ ఉన్న సాదాబైనామా దరఖాస్తులూ ఇప్పుడు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఇంటి స్థలాలకు, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు ఉంటుందని, రైతులు ఎలాంటి రుసుం చెల్లించకుండా ఉచిత న్యాయ సహాయం అందుతుందని చెప్పారు. మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే వాటిని రద్దు చేసే అధికారం ఈ చట్టంలో ఉందని వివరించారు. సదస్సులో ఆర్డీఓ మధు, ఏడీఏ తాతారావు, తహసీల్దార్ ఇమ్మానియేల్, ఎంపీడీఓ సత్యనారాయణ, ఏంపీఓ శ్యాంసుందర్ రెడ్డి, ఏఓ వెంకటరమణ, ఎస్సై రాజమౌళి పాల్గొన్నారు.
మునగసాగుతో అధిక లాభాలు..
ఆయిల్ పామ్, మునగసాగుతో అధిక లాభాలు పొందొచ్చని కలెక్టర్ పాటిల్ అన్నారు. ఆళ్లపల్లి మండలంలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్‌పామ్, మునగ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల ఆయిల్‌పామ్ సాగు పెరిగిందని, నీరు పుష్కలంగా అందిస్తూ మెళకువలు పాటిస్తే అధిక దిగుబడి వస్తుందని అన్నారు. పొలం గట్లపై, అంతర పంటగా మునగ సాగు చేసుకోవాలని సూచించారు. ఇది తక్కువ కాలంలో వచ్చే పంట అన్నారు. అనంతరం గుండాల మండలం యాపలగడ్డలో సమక్క–పగిడిద్దరాజు దేవతలను దర్శించుకున్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి


