జూలూరుపాడు: మొక్కజొన్న కంకులు విరిసేందుకు వెళ్తున్న కూలీల ట్రాలీ అదుపుతప్పి వాగులో పడడంతో పలువురు గాయపడిన ఘటన మండల పరిధిలోని భేతాళపాడులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఏన్కూరు మండలం రాజులపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు చేనులో మొక్కజొన్న కంకులు విరిసేందుకు జూలూరుపాడు మండలం చీపురుగూడెం, టాక్యాతండా, ఎలుకలొడ్డు గ్రామాలకు చెందిన 31 మంది కూలీలు చీపురుగూడేనికి చెందిన టాటా ఏస్ ట్రాలీ ఎక్కారు. భేతాళపాడు సమీపంలోని పెద్దవాగు బ్రిడ్జి వద్దకు రాగానే ట్రాలీ ముందు టైర్ బరస్ట్ కావడంతో అదుపుతప్పి వాగులో పడిపోయింది. దీంతో కూలీలు చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రంగా, మరో 13 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న 108 వాహనంలో ముగ్గురిని, మిగితా వారిని మరో వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోడె శేఖర్, సోడె లక్ష్మీనారాయణ, వజ్జా పగడయ్య, వజ్జా సత్యం, బల్లెం రమేశ్, బొర్రా రాఘవులు, బానోత్ సురేశ్‌బాబు, బచ్చల అజయ్, కోడెం వెంకటేశ్వర్లు, సోడె లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. వారిలో శేఖర్, లక్ష్మీనారాయణ, బచ్చల అజయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఆస్పత్రికి తరలించారు. టాక్యాతండాకు చెందిన బానోత్ సురేశ్‌బాబు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ట్రాలీ డ్రైవర్ పాయం సాయికి స్వల్ప గాయాలయ్యాయి.
10 మంది కూలీలకు తీవ్రంగా, 13 మందికి స్వల్పంగా గాయాలు
భేతాళపాడులో వద్ద ప్రమాదం
పరిమితికి మించి ప్రయాణం..
టాటాఏస్ ట్రాలీ వాహనంలో పరిమితికి మించి 31 మంది కూలీలు ఎక్కగా భేతాళపాడు వద్ద టైర్లకు ఫుల్‌గా గాలి పెట్టించాడు. ఆ తర్వాత కాసేపటికే వాహనం ఎడమ వైపు ముందు టైర్ బరస్ట్ కావడంతో అదుపుతప్పి బ్రిడ్జి కుడి వైపున వాగులో బోల్తా పడింది. అయితే వాగులో నీళ్లు లేకపోవడం, బ్రిడ్జి మొదట్లోనే పడడంతో పెనుప్రమాదం తప్పింది. బ్రిడ్జికి ఇరువైపులా రెయిలింగ్ సక్రమంగా లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమైందని స్థానికులు అంటున్నారు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ ఫోన్ ద్వారా బాధితులను పరామర్శించారు. జూలూరుపాడు ఎస్‌ఐ బాదావత్ రవి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కాగా గాయపడిన వారిని వివిధ పార్టీల నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, మాళోత్ మంగీలాల్, జాటోత్ కృష్ణ, బానోత్ ధర్మా, ఎం.రాజశేఖర్, గౌని నాగేశ్వరరావు, వల్లోజి రమేశ్, ప్రణయ్ తదితరులు పరామర్శించారు.