● ఇల్లెందు ఆస్పత్రిని సందర్శించిన కాయకల్ప బృందం ● అవార్డుకు ప్రతిపాదనలు
ఇల్లెందు: ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఉత్తమ సేవలు అందిస్తున్నారని వైరా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ బాలునాయక్ బృందం కితాబిచ్చింది. కాయకల్ప కార్యక్రమంలో భాగంగా ఈ బృందం మంగళవారం ఇల్లెందు ఆస్పత్రిని సందర్శించింది. ఈ సందర్భంగా బాలునాయక్ తదితరులు ఆస్పత్రిలోని అన్ని వార్డులను తనిఖీ చేసి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ వార్డులో ఉన్న సదుపాయాలు, ఆస్పత్రిలో లేబర్ రూం, ల్యాబ్‌లు, మందుల గదులతో పాటు ఓపీ, పిల్లల వార్డును పరిశీలించారు. శానిటేషన్, తాగునీరు, విద్యుత్, పేషెంట్ల రాక, వారికి అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పేషెంట్లు అధికంగా వస్తుండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఆస్పత్రి భవనం, కిటికీలు, తలుపులు అంత బాగా లేకపోవడంతో కొంత లోటని పేర్కొన్నారు. మొత్తంగా 70 శాతం మేర మార్కులు వేస్తున్నట్లు తెలిపారు. కాగా, వీరు అందించే నివేదిక ప్రకారం కాయకల్ప పథకం వర్తిస్తే.. ఆస్పత్రి అభివృద్ధికి ఏడాదికి రూ.1.50 లక్షల వరకు మంజూరయ్యే అవకాశం ఉంది. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హర్షవర్దన్, ఎండీలు రాంనివాస్, శేఖర్, ఆర్‌ఎంఓ డాక్టర్ బన్సీ, హెడ్ సిస్టర్ నాగేంద్రమ్మ, ఫార్మసిస్ట్ రజనీ, ఆఫీస్ ఇన్‌చార్జ్ రాహుల్ పాల్గొన్నారు.