● అధికారుల అవగాహనతో ఫలితాలు ● వ్యవసాయ విస్తరణ సలహా సంఘం సమావేశంలో ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
వైరా: పంటల సాగునే నమ్ముకున్న రైతులు లాభాలు ఆర్జించడమే ధ్యేయంగా అధికారులు అవగాహన కల్పించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించిన మధ్య తెలంగాణ(ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్) మండల వ్యవసాయ పరిశోధనా విస్తరణ సలహా సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 15, 20ఏళ్లుగా రైతుల ఆదాయం గణనీయంగా తగ్గుతోందన్నారు. గతంలో వరిపై ఎకరాకు రూ.40వేల ఆదాయం వస్తే ఇప్పుడు రూ.20వేలు కూడా రావడం లేదన్నారు. దీనికి తోడు వాతావరణ మార్పులతోనూ వారు నష్టపోతున్నారన్నారు. ఈమేరకు ఆయిల్‌పామ్, కూరగాయలు, డ్రాగన్ ప్రూట్ తదితర పంటలు సాగు చేయడం, ఆధునిక విధానాలు పాటించడంపై ఎప్పటికప్పుడు వివరించాలని సూచించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్ బలరామ్, విస్తరణ సంచాలకుడు డాక్టర్ ఎం.యాదాద్రి, మధ్య తెలంగాణ రీజియన్ సహాయ పరిశోధనా సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి, డీడీఏ సింగారెడ్డి, కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ మాలతి, మధిర వ్యవసాయ పరిఽశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రుక్మిణీదేవి మాట్లాడారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం డైరెక్టర్లు, వివిధ విభాగాల శాస్త్రవేత్తలు, ఉమ్మడి ఖమ్మం, మెదక్, వరంగల్ జిల్లాల వ్యవసాయ అనుబంధ ఽశాఖల అధికారులు, ఆర్‌ఈఏసీ సభ్యుడు రాణాప్రతాప్, ఆదర్శ రైతులు పాల్గొన్నారు.