దుమ్ముగూడెం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ శివనాయక్ ఆదివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచవటీ కుటీరం, సీతమ్మవారి నారచీరల ప్రాంతాలను సందర్శించి వాటి విశిష్టతలను తెలుసుకున్నారు. ముందుగా అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అఽథ్లెటిక్స్‌లో
జిల్లాకు ఐదు పతకాలు
కొత్తగూడెంటౌన్: తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు ఐదు పతకాలు వచ్చాయని జిల్లా అఽథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.మహీధర్ తెలిపారు. ఈ మేరుకు ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 22న తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. పరుగుపందెంలో జర్పుల దీక్షిత్ బంగారు పతకం, మాలోతు సింధు రజత పతకం, డి.లోకేష్, బి.దుర్గ కాంస్య పతకాలు, జావెలిన్‌లో ఎం.కృష్ణవేణి కాంస్య పతకం సాధించారని వివరించారు. విజేతలను జిల్లా క్రీడల శాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి, క్రీడా సంఘాల బాధ్యులు కె.సారంగపాణి, యుగంధర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, రాధాకృష్ణ, పి.నాగేందర్, మల్లికార్జున్, గిరిప్రసాద్, జి,కృష్ణ, జె. నాగరాజు, కోచ్‌లు అభినందించారు.
విద్యారంగాన్ని
బలోపేతం చేయాలి
ఖమ్మం సహకారనగర్ : రాష్ట్రంలో ప్రభుత్వం విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభవాని కోరారు. నగరంలోని సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పూర్వ ప్రాథమిక పాఠశాలల వల్ల బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక సౌలభ్యం కలుగుతుందని, పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి రెండో వేతన సవరణ సంఘం రిపోర్టును తెప్పించి 2023 జూలై నుంచి నూతన పీఆర్సీ అమలు చేయాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, వల్లకొండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
లిఫ్ట్ ప్రమాద ఘటనపై విచారణ
ఖమ్మంవైద్యవిభాగం : నగరంలోని ప్రసూన ఆస్పత్రిలో లిఫ్ట్ ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటనపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఆదివారం విచారణ చేపట్టారు. ఆ ఆస్పత్రిలో అపరేషన్ అనంతరం సరోజని(62) అనే మహిళను అపరేషన్ థియేటర్ నుంచి లిఫ్ట్ ద్వారా తరలించే క్రమంలో స్ట్రెచర్ పైనే ప్రాణాలు విడిచిన విషయం విదితమే. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ నిమిత్తం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సైదులు విచారణ నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలపై సిబ్బందితో ఆరా తీశారు. సాంకేతిక లోపంతో లిఫ్ట్ అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు డాక్టర్ సైదులు తెలిపారు. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి నివేదించనున్నట్లు వివరించారు. ఆస్పత్రిలో లిఫ్ట్ స్థితిగతులు, కంపెనీ వివరాలు, ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు, ఇంతకుముందు ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై నివేదిక సమర్పించాలని ఆస్పత్రి యాజమాన్యానికి నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. పూర్తి నివేదిక వచ్చాక యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పర్ణశాలను సందర్శించిన న్యాయమూర్తి
పర్ణశాలను సందర్శించిన న్యాయమూర్తి
పర్ణశాలను సందర్శించిన న్యాయమూర్తి