మణుగూరురూరల్: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడమే కాక ప్రజల అవసరాల కోసం ఉచితంగా సరఫరా చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యాన మణుగూరులోని పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించాక ధర్నా చేశారు. కాంతారావు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సూచిస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా చెక్‌పోస్టులను బలోపేతం చేసి అక్రమ రవాణాను అడ్డుకోవడమే కాక ప్రజల అవసరాలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ మండల, పట్టణ కన్వీనర్లు కుర్రి నాగేశ్వరరావు, కుంటా లక్ష్మణ్, నాయకులు పోశం నర్సింహరావు, వట్టం రాంబాబు, అడపా అప్పారావు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, ముద్దంగుల కృష్ణ, నర్సింహరావు, మునుకోటి ప్రమీల, రమాదేవి, చంద్రకళ రుద్ర వెంకట్, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.