● మూడు నెలలుగా జీతాలు రాక పంచాయతీ కార్మికుల అవస్థ ● ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన
చుంచుపల్లి: పారిశుద్ధ్య పనులు చేపడుతూ పల్లెను పరిశుభ్రంగా ఉంచే పంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందడంలేదు. జనవరి నుంచి జీతాలు రాకపోవడంతో కుటుంబాలు ఆర్థికంగా అవస్థ పడుతున్నాయి. ఏడాది కాలంగా పంచాయతీలకు సర్పంచులు లేరు. పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు బాధ్యతలు నిర్వహిస్తున్నా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు సకాలంలో రాక వీరి వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతోంది.
ఉమ్మడి జిల్లాలో 4,492 మంది కార్మికులు
ఉమ్మడి జిల్లాలోని 1,070 గ్రామ పంచాయతీల పరిధిలో 4,252 మంది పారిశుద్ధ్య కార్మికులు (ఎంపీడబ్ల్యూ) విధులు నిర్వర్తిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 481 గ్రామపంచాయతీల్లో 2,129 మంది, ఖమ్మం జిల్లాలోని 589 గ్రామపంచాయతీల్లో 2,363 మంది పనిచేస్తున్నారు. మల్టీపర్పస్ వర్కర్లుగా పేర్కొంటున్న వీరిని స్థానిక అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల పనులకు వినియోగించుకుంటున్నారు. వాటర్‌మెన్, పారిశుద్ధ్య కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్, కారోబార్, పంపు ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ విధులు నిర్వర్తింజేస్తున్నారు. జీఓ నంబర్ 51 ప్రకారం ఒక్కో కార్మికుడికి నెలకు రూ.9,500 చొప్పున ఆన్‌లైన్ ద్వారా వేతనం చెల్లిస్తారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలికంగా నియమించుకునే వారికి నెలకు రూ.5 వేలు ఇస్తారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో 12 నుంచి 15 మంది వరకు, చిన్న పంచాయతీల్లో ఎనిమిది మంది వరకు వీరు ఉన్నారు. పారిశుద్ధ్య పనులు, హరితహారం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల పరిశుభ్రత, ఇంటింటికీ ట్రాక్టరు ద్వారా చెత్త సేకరణ, విద్యుద్దీపాల నిర్వహణ, డంపింగ్ యార్డుల్లో కంపోస్ట్ ఎరువు తయారీ, తాగునీటి సరఫరా తదితర విభాగాల్లో పనిచేస్తున్నారు. పలుమార్లు వేతన సమస్యను ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 30న ఉగాది పండుగ లోపైనా వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు
జనవరి నుంచి వేతనాలు రాకపోవడంతో కార్మిక కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. జిల్లా అధికారులను అడిగితే త్వరలో వస్తాయంటున్నారు. కనీసం ఉగాది పండుగ లోపైనా వేతనాలు విడుదల చేయాలి.
–డి.అమర్‌నాథ్, జీపీ వర్కర్స్ యూనియన్
(ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు
త్వరలో విడుదలకు అవకాశం
పారిశుద్ధ్య కార్మికులకు జనవరి నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. పెండింగ్ జీతాల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వీరికి త్వరలోనే వేతనాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
– వి.చంద్రమౌళి, డీపీఓ, భద్రాద్రి కొత్తగూడెం
ఉగాదికై నా వేతనాలిస్తారా..?
ఉగాదికై నా వేతనాలిస్తారా..?