● తుమ్మలచెరువులో సందడే సందడి.. ● ఈనెల 26 వరకు కొనసాగనున్న ట్రైనింగ్
అశ్వాపురం: మండల పరిధిలో కాకతీయుల కాలంలో నిర్మించిన తుమ్మలచెరువులో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో రోయింగ్ వాటర్ స్పోర్ట్స్ శిక్షణ ఇస్తున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ శిక్షణ ఈనెల 26 వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో మాత్రమే ఈ శిక్షణ ఇస్తున్నారు. అయితే తుమ్మలచెరువు 2 నుంచి 3 కిలోమీటర్ల పొడవు, 800 మీటర్లకు పైగా వెడల్పుతో నీరు నిలకడగా ఉంటుండడంతో ఈ శిక్షణకు అనుకూలంగా ఉంటుందని ఇక్కడ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
బోటింగ్‌తో గుర్తింపు..
గత జనవరిలో ప్రారంభించిన బోటింగ్‌తో తుమ్మలచెరువుకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక చొరవ చూపించగా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బోటింగ్ ప్రారంభించారు. మొదట 10 నుంచి 15 మంది మాత్రమే బోట్ షికారు చేయగా ప్రస్తుతం రోజుకు 100 నుంచి 150 మంది బోట్ ఎక్కుతున్నారు. గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు దీన్ని నిర్వహిస్తున్నారు.
యువతకు ఉచిత శిక్షణ..
జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి ఆధ్వర్యంలో తుమ్మలచెరువు వద్ద అంతర్జాతీయ రోయింగ్ క్రీడాకారుడు యలమంచిలి కిరణ్ గిరిజన యువతకు ఉచితంగా రోయింగ్ వాటర్ స్పోర్ట్స్ శిక్షణ ఇస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో క్రీడల్లో విశేషంగా రాణించే గిరిజన యువత రోయింగ్ వాటర్ స్పోర్ట్స్‌లోనూ ప్రతిభ చాటే అవకాశం ఉంది. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయి. పురుషుల్లో లైట్ వెయిట్(68–72.5 కేజీలు), ఓపెన్ వెయిట్ (72.5 పైన), సీ్త్రలలో లైట్ వెయిట్(57–59), ఓపెన్ వెయిట్ (62.5 పైన) విభాగాల్లో స్వీప్ రోయింగ్, స్కల్ రోయింగ్ ఉంటాయి. సింగిల్ స్కల్, డబుల్ స్కల్, క్వార్డ్‌బుల్ స్కల్, స్వీప్ రోయింగ్‌లో పెయిర్(ఇద్దరు), కాక్స్‌లెస్(నలుగురు), కాక్స్‌డ్ యైట్(ఎనిమిది మంది) పోటీలు ఉంటాయి. ఇక్కడ శిక్షణ పొందిన వారికి హుస్సేన్‌సాగర్‌లో ఓపెన్ ట్రైల్స్ నిర్వహించి పోటీలకు ఎంపిక చేస్తారు.