స్పష్టమైన లక్ష్యంతో..
ఇవీ
ప్రయోజనాలు
కెరీర్ గైడెన్స్‌పై ఐటీడీఏ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు
ప్రభుత్వ ఉన్నతాధికారులతో నెలకు రెండు సెమినార్లు
ఆసక్తి, అభిరుచికి తగిన రంగంపై అవగాహన
నూతన సంవత్సరం వచ్చేసింది. గతేడాది కష్టనష్టాలకు వీడ్కోలు పలికి కొత్త ఏడాదిలో అందరూ స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకుంటారు. ప్రధానంగా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని, ఉన్నత విద్య చదవాలని, ప్రముఖ కళాశాలల్లో అడ్మిషన్ పొందాలని భావిస్తారు. అయితే ఐటీడీఏ అధికారులు గడిచిన ఏడాది నుంచి విద్యార్థులే భవిష్యత్ తీర్చిదిద్దుకునేలా కెరీర్ గైడెన్స్‌పై ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నారు. ఉన్నతస్థాయి అధికారులతో సెమినార్లు నిర్వహిస్తూ స్ఫూర్తి నింపుతున్నారు. ఇతర యాజమాన్యాల పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
దమ్మపేట: విద్యార్థులు సరైన కోర్సు, స్పష్టమైన లక్ష్యాన్ని ఎంపిక చేసుకునేందుకు భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో కెరీర్ గైడెన్స్‌పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లోని 8 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ప్రభుత్వ ఉన్నత అధికారులతో నెలకు రెండు సెమినార్లు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఉపయోగకరంగా మారింది. ఆసక్తి, శక్తి సామర్థ్యాలు, అవకాశాలు తదితర అంశాలపై అవగాహన పెంపొందుతోంది. తద్వారా ఉన్నత విద్యలో సరైన కోర్సును ఎంపిక చేసుకోవడంలో సఫలీకృతులవుతారని, స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని సాధించే దిశగా పయనిస్తారని అధికారులు చెబుతున్నారు.
ఉన్నతంగా ఎదిగేలా..
కెరీర్ గైడెన్స్‌లో భాగంగా విద్యార్థుల ఆసక్తులు, అభిరుచులను పేపర్‌పై రాయించి, వాటిని ఉపాధ్యాయులు విశ్లేషిస్తున్నారు. సంబంధిత సామర్థ్యాలకు తగిన కోర్సులను విద్యార్థులు ఎంపిక చేసుకోవడంలో తోడ్పాటునందిస్తున్నారు. పదో తరగతి అనంతరం అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్, మెడిసిన్, రీసెర్చ్, ఐటీ, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ వంటి కోర్సులు గురించి సంబంధిత రంగాల్లో నైపుణ్యం ఉన్న ఉద్యోగులతో సమగ్రంగా అవగాహన కల్పిస్తున్నారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల గురించి వివరిస్తున్నారు. కమ్యూనికేషన్, ఇంగ్లిష్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, వలంటీర్ వర్క్ ప్రాజెక్ట్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ వంటి నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందిస్తున్నారు. తద్వారా విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నతంగా స్థిరపడే అవకాశం ఉందని ఉపాధ్యాయులు, ఐటీడీఏ అధికారులు పేర్కొంటున్నారు.
దీర్ఘకాలిక సంతృప్తి
కెరీర్ గైడెన్స్‌తో విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగంలో స్థిరపడి, దీర్ఘకాలికంగా సంతృప్తి చెందే అవకాశం ఉంది. ఆసక్తికి తగిన రంగం, ఉద్యోగంలో నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన కోర్సులు, నైపుణ్యాలను నేర్చుకొని ఆ రంగంలో ఎలాంటి సమస్య అయినా పరిష్కరించగల స్థాయికి చేరుకుంటారు. ఇష్టంతో ఉద్యోగం చేస్తూ, ఉద్యోగ కాలమంతా సంతృప్తిగా పనిచేసే అవకాశం ఉంటుంది.
విద్యార్థులు ఉన్నతంగా స్థిరపడేలా..
స్పష్టమైన లక్ష్యంతోపాటు సరైన కోర్సు ఎంపిక
ఆసక్తి ఉన్న రంగంలోనే వృత్తి రీత్యా స్థిరపడటం
గందరగోళం, పరీక్షల భయం, భవిష్యత్‌పై ఆందోళన వీడతారు. మానసిక ఒత్తిడి వంటివి తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
కమ్యూనికేషన్, టీం వర్క్, మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు.
భవిష్యత్‌పై అవగాహనతో కూడిన నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది
చదువులో ప్రతికూలతలను అధిగమించడంతోపాటు చురుకుదనం పెరుగుతుంది.
స్పష్టమైన లక్ష్యంతో..


