రామయ్యకు రాపత్తు సేవ
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా రామయ్యకు రాపత్తు సేవలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం అంబసత్రం ఆధ్వర్యంలో ఈ సేవను జరిపారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామస్మరణల నడుమ నిర్వహకులు సత్రం వద్దనున్న మండపంలో కొలువుదీర్చారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, అంబసత్రం నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.
నిత్యకల్యాణాలు పునఃప్రారంభం
అధ్యయనోత్సవాలలో పగల్ పత్తు ఉత్సవాల సందర్భంగా నిలిపివేసిన నిత్యకల్యాణాలను బుధవారం పునఃప్రారంభించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.


