● భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు ● శ్రీరామనవమి ఏర్పాట్లపై అధికారులతో సమావేశం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి కల్యాణం, మహాపట్టాభిషేకం మహోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు సూచించారు. ఏప్రిల్ 6,7 తేదీల్లో జరిగే రామయ్య కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవాలకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం డివిజన్‌స్థాయి అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిథిలా స్టేడియంలో కల్యాణ మండపాన్ని 24 సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు. భక్తులు ఒక సెక్టార్ నుంచి మరో సెక్టార్‌కు వెళ్లకుండా భారీకేడ్లు ఏర్పాటు చేయాలని, ఆన్‌లైన్‌లో లాడ్జిలు బుకింగ్, టికెట్లు విక్రయాలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పారిశుద్ధ్య సిబ్బందిని ప్రత్యేకంగా నియమిస్తామని, పారిశుద్ధ్య కార్యక్రమాల పర్యవేక్షణకు పట్టణాన్ని 25 జోన్లుగా విభజించి అధికారులను కేటాయించినట్లు వివరించారు. దాదాపు 200 తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయాలన్నారు.
రెస్క్యూ టీమ్‌లను అందుబాటులో ఉంచాలి
వాహనాల పార్కింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక వాహనాలను ఎస్టీమ్ గిరీష్ పరికరాలను సిద్ధంగా ఉంచాలని వివరించారు. రెస్క్యూ టీములను, నాటు పడవలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. నదిలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల రద్దీ నియంత్రణకు మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 20 బెడ్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. తలంబ్రాలు, ప్రసాదం భక్తులందరికీ అందేలా చూడాలన్నారు. పోలీసుల సహకారంతో మొబైల్ తలంబ్రాల కౌంటర్లు కూడా ఏర్పాట్లు చేయాలన్నారు. 25 సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని డీపీఆర్వోకు సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ రమాదేవి, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.