అశ్వారావుపేటరూరల్: అడవులపై ఆదివాసీలకే సంపూర్ణ హక్కు ఉంటుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. మండలంలోని కావడిగుండ్ల, గాండ్లగూడెం, పండువారిగూడెంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ ఫలాలతో పాటు ఏ విషయంలోనూ గిరిజనులకు అడ్డు చెప్పొద్దన్నారు. కొండరెడ్ల గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ సౌకర్యాల కల్పనకు అవకాశం ఇవ్వాలని అధికారులకు సూచించారు. అటవీ చట్టాల్లో ఏమైనా లొసుగులు ఉంటే సవరించాలన్నారు. పోడు పట్టాలున్న వారికి గిరి వికాసం పథకం కింద కరెంట్, బోర్లు, మోటార్లు ఇవ్వాలని కోరారు. ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ.. గిరిజనుల్లో ఇంకా ఎవరైనా అర్హులుంటే సర్వే చేసి పోడు పట్టాలు ఇస్తామని చెప్పారు. కావడిగుండ్ల, గాండ్లగూడెంలో 60 మందికి హక్కు పత్రాలు ఇచ్చామన్నారు. నిరుద్యోగ గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఐటీడీఏ ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. గాండ్లగూడెం నుంచి చెన్నాపురం వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని, పనులు పూర్తి కాగానే ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కాగా, ఐటీడీఏ రుణాల మంజూరుకు ఓ ఉద్యోగి రూ.10వేల చొప్పున వసూలు చేస్తున్నాడని కావడిగుండ్ల సభలో గిరిజనులు ఫిర్యాదు చేయగా అతడిని సస్పెండ్ చేయాలని హుస్సేన్‌నాయక్ పీఓకు సిఫార్సు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు, ఎఫ్‌డీఓ దామోదర్ రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ మహేందర్, డీడీ మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
హుస్సేన్‌నాయక్