కొత్తగూడెంఅర్బన్: మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలం ముగిసినా వార్డుల్లో పట్టు నిలుపుకునేందుకు మాజీ కౌన్సిలర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. పని లేకపోయినా వార్డుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ పోటీకి సై అంటున్న సదరు నాయకులు.. ప్రజల్లో ఆదరణ తగ్గొద్దనే భావనతో ముందుకు సాగుతున్నారు. కౌన్సిలర్‌గా ఉన్న గత ఐదేళ్లలో కొందరు తమ వార్డులోని అన్ని కుటుంబాలకూ సమన్యాయం చేయలేదనే అపవాదు మూటగట్టుకున్నారు. ఆ నిందల నుంచి బయటపడేందుకు ఇప్పుడు ముప్పుతిప్పలు పడుతున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రజల ఇళ్లలోనూ ఏ కార్యక్రమం జరిగినా తామున్నామంటూ వెళుతున్నారు. ఆయా వార్డుల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు ఏవి జరిగినా పోటాపోటీగా పాల్గొంటూ ప్రజల ఆదరణ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీగానే ఎన్నికలు జరిగితే ఎలా నడుచుకోవాలి, కార్పొరేషన్‌గా మారితే ఎలా వ్యవహరించాలనే విషయంలో వ్యూహాలు పన్నుతున్నారు. గతంలో వారు ప్రాతినిధ్యం వహించిన వార్డుతో పాటు పక్కనున్న ఒకటి, రెండు వార్డుల్లోనూ తిరుగుతూ ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఇక ఖర్చు పెట్టే విషయంలోనూ మున్సిపాలిటీ అయితే ఎంత, కార్పొరేషన్‌లో అయితే ఎంత అని లెక్కలు వేసుకుంటున్నారు.
మున్సిపాలిటీల్లో ఇలా..
జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల పాలకవర్గ పదవీ కాలం జనవరిలో ముగిసింది. కొత్తగూడెంలో 36 వార్డులు ఉండగా 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ – 29, సీపీఐ –04, ఇండిపెండెంట్లు –02, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందాయి. ఇక ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డులుండగా గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ –21, రెబల్ అభ్యర్థి ఒకరు, న్యూడెమోక్రసీ, సీపీఐ అభ్యర్థులు ఒక్కొక్కటి చొప్పున గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో చాలా మంది మాజీ కౌన్సిలర్లు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. దీంతో పాటు కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐకి చెందిన ఎమ్మెల్యే ఉండడంతో మరి కొంతమంది మాజీ కౌన్సిలర్లు ఆ పార్టీలోనూ ఉన్నారు. బీఆర్‌ఎస్‌ను నమ్ముకుని ఉన్నవారు అందులోనే పని చేస్తున్నారు. అయితే మాజీ కౌన్సిలర్లు పార్టీ ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు అందరితోనూ కలిసి ఐక్యతా రాగం పాడుతున్నారు.
మున్సిపాలిటీల్లో మాజీ కౌన్సిలర్ల హడావిడి
వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలపై ఆరా..
ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పోటాపోటీగా హాజరు
అందరితోనూ సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నాలు
చైర్మన్ పదవిపై గురి..
ఈ సారి మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొస్తాయనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేకున్నా.. పలువురు అభ్యర్థులు అప్పుడే చైర్మన్ పీఠంపై గురి పెడుతున్నారు. గత పాలకవర్గంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి కావాలని ఆశించి భంగపడిన నలుగురు.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకు ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదంటున్నారు. అన్ని వార్డుల్లో టికెట్లు ఆశిస్తున్న వారితో.. గెలిస్తే తనకే మద్దతు ఇవ్వాలంటూ రహస్య మంతనాలు సాగిస్తున్నారు.