వేసవిలో వేటగాళ్ల ముప్పు | - | Sakshi
Sakshi News home page

వేసవిలో వేటగాళ్ల ముప్పు

Mar 16 2025 12:26 AM | Updated on Mar 16 2025 12:25 AM

● వేటకు బలవుతున్న అడవి జంతువులు ● ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లతో జీవాల వధ ● జిల్లాలో నిత్యకృత్యంగా మారుతున్న వైనం ● నాలుగేళ్లలో 49 జంతువధ కేసులు నమోదు

జిల్లాలోని దట్టమైన అడవిలో పెరిగే వన్యప్రాణులు వేసవి కాలంలో ఆహారం లేదా తాగునీటి కోసం.. జనావాసాల వైపు వస్తుంటాయి. ఇలావచ్చే మూగ జీవులు వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. నదులు, చెరువులు, వాగుల వద్ద దట్టమైన పొదల్లో ఉరులు, ఉచ్చులను బిగించి వేటగాళ్లు వన్యప్రాణులను పొట్టన పెట్టుకుంటున్నారు. మరికొన్ని చోట్ల అత్యంత ప్రమాదకరమైన కరెంట్‌ వైర్ల సాయంతో జంతువులను వధిస్తున్నారు. దుండగులు వేటకు విద్యుత్‌ తీగలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటితో మనుషుల ప్రాణాలకు సైతం ప్రమాదం పొంచి ఉంది. – చుంచుపల్లి

గతంలో వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడి మాంసాన్ని అమ్ముతూ పట్టుపడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. జంతువులను వేటాడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో వేటగాళ్లు జంతువుల కొమ్ములు, మాంసం, గోర్లు, చర్మాలు వంటి భాగాలను విక్రయిస్తున్నారు. జింకలు, అడవి పందులు, ముళ్ల పందులు, కొండ గొర్రెలు, ఎలుగుబంట్లు, దుప్పులు, ఉడుములు, నక్కలు, అడవిపిల్లులు, ముంగిసలు, ఇతర జంతువులకు జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతం అనువుగా ఉంది. అయితే, వేటగాళ్ల వల్ల రానురాను వీటి రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. వేసవిలో వన్యప్రాణులను వేటాడే వేటగాళ్లను కట్టడి చేయకపోతే అడవి జంతువుల సంఖ్య కనుమరుగయ్యే ప్రమాదముందని జంతుప్రేమికులు వాపోతున్నారు.

వన్యప్రాణులను వధిస్తే కఠిన శిక్షలు

జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, కిన్నెరసాని వంటి ఆరు అటవీ డివిజన్ల పరిధిలో 10.45 లక్షల ఎకరాల అడవులు విస్తరించి ఉన్నాయి. అడవి జంతువులను పెంచుకోవడం, వేటాడటం వంటిది పూర్తిగా నిషేధం. మన పరిసరాల్లోనూ వాటిని మచ్చిక చేసుకోవడంతో పాటు మాంసం కలిగి ఉండటం నేరమని వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 చెబుతోంది. ఈ చట్టంలోనూ ఇటీవల కొన్ని మార్పులు చేశారు. జంతువులను వేటాడిన కేసులో నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. అవసరమైతే నేరాన్ని బట్టి ఈ రెండింటినీ అమలు చేయొచ్చుని అధికారులు చెబుతున్నారు. ఇక కొన్ని జంతువుల వేట విషయంలో నేరం జరిగితే బెయిల్‌ కూడా లభించదు. అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణ అందరి కర్తవ్యం. గ్రామ పరిసరాల్లోకి అడవి జంతువులు వస్తే వాటికి హాని తలపెట్టకుండా సంబంధిత అధికారులకు తెలపాల్సి ఉంది. అడవులు, పొలాల్లో వేటకు విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేయడం, ఉచ్చులు, వలలు అమర్చడం కూడా చట్టరీత్యా నేరం. అలాంటిది పచ్చని అడవుల్లో స్వేచ్ఛగా తిరగాల్సిన వన్యప్రాణులకు వేటగాళ్ల నుంచి ప్రమాదం ముంచుకొస్తోంది. వేసవి కాలం.. వన్యప్రాణులకు మరింత ప్రాణసంకటంగా మారుతోంది.

2021 డిసెంబర్‌లో దమ్మపేట మండలం రంగువారిగూడేనికి చెందిన ప్రొద్దుటూరి డానియేలు, రాకేశ్‌ తండ్రీకొడుకులు ఇద్దరు వేటకు వెళ్లి జంతువుల కోసం అమర్చిన అదే విద్యుత్‌ తీగలు తగిలి మృత్యువాత పడిన ఘటన జిల్లాలో సంచలనమైంది.

2022 మార్చిలో కొత్తగూడెం పట్టణానికి చెందిన సునీల్‌కుమార్‌ చుంచుపల్లి మండలం పెనుబల్లి అడవి ప్రాంతంలో స్నేహితులతో కలిసి వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో జంతువుల వేటకు వేరొకరు అమర్చిన విద్యుత్‌ తీగలు తగలడంతో మృత్యువాత పడ్డాడు.

2023 మార్చిలో ఫారెస్ట్‌ స్పెషల్‌ టీం కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్‌ రోడ్డు వద్ద పులి చర్మం అమ్మడానికి వెళ్తున్న తొమ్మిది మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

సుజాతనగర్‌ మండలం ఒడ్డుగూడెంలో కుక్కలదాడిలో చుక్కల దుప్పి మృత్యువాత పడింది.

ఇక జంతువులను వేటాడిన అంశంలో జిల్లాలో నాలుగేళ్లలో 2021–22లో 14, 2022–23లో 19, 2023–24లో 07, 2024–25లో 9 చొప్పున జంతువధ కేసులు నమోదయ్యాయి.

వేటగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తాం

వేసవి కాలంలో వన్యప్రాణులు నీళ్ల కోసం ఎక్కువగా చెరువులు, కుంటలు, వాగుల వద్దకు వస్తూ ఉంటాయి. ఇది అదునుగా భావించి వేటగాళ్లు వాటిని హతమార్చేందుకు కరెంట్‌ తీగలు, ఉచ్చులు అమర్చుతుంటారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. నిరంతరం నిఘాపెట్టి పర్యవేక్షణ చేయాలని సిబ్బందిని ఆదేశించాం. అడవి జంతువుల వేటకు పాల్పడిన వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.

– కిష్టాగౌడ్‌, జిల్లా అటవీశాఖ అధికారి

వేసవిలో వేటగాళ్ల ముప్పు 1
1/1

వేసవిలో వేటగాళ్ల ముప్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement