పుస్తకం..హస్తభూషణం | Sakshi
Sakshi News home page

పుస్తకం..హస్తభూషణం

Published Tue, Apr 23 2024 8:35 AM

సత్తుపల్లి గ్రంథాలయంలో పాఠకులు - Sakshi

నేటికీ మంచి నేస్తాలే
● ఆన్‌లైన్‌ యుగంలో కూడా తగ్గని పఠనాసక్తి ● వెబ్‌ సైట్లలోనూ అందుబాటులో పుస్తకాలు ● నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం

సత్తుపల్లిటౌన్‌: పుస్తకం ఒంటరి తనాన్ని పోగొట్టే సాధనం.. మంచి, చెడులను చెప్పే సాధనం.. అందుకే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. నా వద్ద ఏ మాత్రం డబ్బులు ఉన్నా వాటితో పుస్తకాలు కొంటాను.. మిగిలిన సొమ్ముతో తిండి, బట్టా సమకూర్చుకుంటాను అన్నారు ఇంకో మహానుభావుడు. నిజజీవితంలో పుస్తకాలకు ఉన్న విలువను చాటిచెప్పే వ్యాఖ్యలివి. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు పుస్తక పఠనంలో మార్పులు వచ్చినా.. ఎంచుకోవటంలో ప్రాధాన్యతలు మారినా పఠనాసక్తి మాత్రం తగ్గడం లేదు. నేడు(మంగళవారం) ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా కథనం.

విజ్ఞాన భాండాగారాలు

పుస్తకం మనకు తెలియని ఎన్నో విషయాలను ఎన్నో విషయాలను చెబుతుంది. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. అందుకే పుస్తకాన్ని హస్త భూషణం అంటారు. ప్రస్తుతం అందరి చేతుల్లో ఇంటర్నెట్‌తో కూడిన సెల్‌ఫోన్లు వచ్చినా పుస్తకాలకు ఆదరణ తగ్గలేదనే చెప్పుకోవాలి. చదువుకునే పుస్తకాలు, చదివే సాధనాలు మారినా పఠనాసక్తి తగ్గలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పుడంతా పోటీ పరీక్షలకే..

ఒకప్పుడు నవలలు, కథల పుస్తకాలను ఎక్కువగా చదివేవారు. లైబ్రరీల్లోనూ వీటికి డిమాండ్‌ ఉండేది. ముఖ్యంగా విప్లవ సాహిత్యం, దేశభక్తి, పౌరాణికం, డిటెక్టీవ్‌ నవలలకు ఎందరో అభిమానులు ఉండేవారు. కొత్త పుస్తకాలు మార్కెట్‌లోకి వస్తే వెంటనే కొనేవారు. కానీ అలాంటి పుస్తకాలు కొనేవారు ఇప్పుడు అరుదుగానే ఉన్నారని చెప్పుకోవాలి. ప్రస్తుత యువత విజ్ఞానం, ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలకు పెద్దపీట వేస్తున్నారు. అందుకే నవలలు, కథల పుస్తకాలు ఏళ్ల క్రితం ముద్రించినవే లైబ్రరీల్లో కనిపిస్తున్నాయి.

విజయం వైపు..

ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలలో కొలువు సాధించటం కోసం యువత తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో వారు పోటీ పరీక్షలపై దృష్టి సారించడంతో షాపులు, లైబ్రరీల్లో ఈ తరహా పుస్తకాలే అందుబాటులో ఉంటున్నాయి. అదే విధంగా విజయం వైపు ఎలా పురుగులు తీయాలనే పలు అంశాలను వివరిస్తూ లక్ష్యం, ఆశయాలు, నడవడిక అంశాలతో ముద్రించిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో లభిస్తున్నాయి.

ఆన్‌లైన్‌లోనూ పుస్తకాలు

చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చాలు ఆన్‌లైన్‌లో కావాల్సిన పుస్తకాలను ఈ–బుక్‌ ద్వారా చదివే వెసలుబాటు ఉండడంతో పఠనాసక్తి తగ్గడం లేదని చెబుతున్నారు. పోటీ ప్రపంచంలో లైబ్రరీకి వెళ్లలేక, పుస్తకాలను కొనలేక పలువురు ఈ–బుక్‌లో చదువుతూ విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. కాగా, వేసవి సెలవుల్లో పిల్లలనుతల్లిదండ్రులు గ్రంథాలయాలకు పంపించి పఠనాసక్తి పెంపొందించాల్సిన అవసరముందని పలువురు సూచిస్తున్నారు. తద్వారా సెల్‌ఫోన్‌ నుంచి దూరం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయాలు 43

పుస్తకాలు 4,98,303

డిపాజిటర్లు 31,755

పాఠకులు 11,85,392 మంది

Advertisement
Advertisement