
సోదాలు నిర్వహిస్తున్న అధికారులు
పాల్వంచ: పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు, రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ కిలారు నాగేశ్వరరావు ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం మంగళవారం సోదా చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంపిణీ కోసం భారీ ఎత్తున నగదు ఉంచారనే సమాచారంతో స్క్వాడ్ అధికారి భాస్కర్‌రావు నేతృత్వంలో గట్టాయిగూడెంలోని ఆయన ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. నాగేశ్వరరావు కుమారుడు చిన్ని సైతం ఊర్లో లేకపోగా అతడి గదులను సైతం తీయించి పరిశీలించినా ఎక్కడా నగదు లభించకపోవడంతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా కిలారు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అధికారులకు తప్పుడు సమాచారం అందిందని తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ హరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.