సెంచరీకి చేరువలో.. | Sakshi
Sakshi News home page

సెంచరీకి చేరువలో..

Published Fri, Nov 10 2023 12:34 AM

ఇల్లెందులో హరిప్రియ నామినేషన్‌ సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు   - Sakshi

జిల్లాలో 83కు చేరిన నామినేషన్లు
● గురువారం ఒక్కరోజే 31 మంది 54 సెట్లు దాఖలు ● ఏకాదశి ముహూర్తం మంచిదనే భావన ● నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ ● కండువాలు మార్చుతున్న నేతలు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : ముహూర్త బలం బాగుందనే నమ్మకంతో గురువారం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్నవారు కూడా నామినేషన్లు వేశారు. దీంతో రిటర్నింగ్‌ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

ఒక్కరోజే 31 నామినేషన్లు..

ఈనెల 3న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయినప్పటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. గత ఐదు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 52 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. గురువారం ఒక్కరోజే 31 మంది అభ్యర్థులు 54 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో అత్యధికంగా కొత్తగూడెం నుంచి ఏడుగురు అభ్యర్థులు 11 సెట్లు, మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో ఆరుగురు చొప్పున 43 సెట్లు వేశారు. కాగా, నామినేషన్ల దాఖలుకు శుక్రవారంతో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు జిల్లా మొత్తం కలిపి 83 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దూకేందుకు సిద్ధమయ్యారు. నేడు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. మొత్తంగా వంద మందికి పైగా అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందని పరిశీలకుల అంచనా.

రేగా, పొదెం, హరిప్రియ దాఖలు..

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, పొదెం వీరయ్య భద్రాచలం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు పినపాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. అంతుకుముందు తల్లికి పాదాభివందనం చేసిన రేగా, అభిమానులతో కలిసి నామినేషన్‌కు బయలుదేరారు. ఇల్లెందు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోతు హరిప్రియా నాయక్‌ భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. వీరి తరఫున ఇప్పటికే నామినేషన్లు దాఖలైనప్పటికీ ముహూర్తం బాగుండడంతో మరోసారి నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపారు.

‘గూడెం’లో నేడు వనమా..

గత ఎన్నికల తర్వాత సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీమంత్రి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నామినేషన్‌ పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఈ ఏడాది నామినేషన్‌ వేసే విషయంలో ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులంతా ఇప్పటికే నామినేషన్లు వేసినా వనమా తొందరపడలేదు. శుక్రవారం ఆయన నామినేషన్‌ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కొత్తగూడెంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి నేరుగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకోనున్నారు.

బరిలో జలగం !

ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి జలగం వెంకట్రావు బరిలో ఉంటారా ? నిలిస్తే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనే ఆసక్తి కొత్తగూడెంతో పాటు జిల్లా అంతటా నెలకొంది. అయితే శుక్రవారం జలగం వెంకట్రావు నామినేషన్‌ దాఖలు చేస్తారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.

మారుతున్న సమీకరణలు..

నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, ముగ్గురు కౌన్సలర్లు, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్ల కృష్ణ, ఎంపీటీసీ మెట్ల శిరోమణి తదితరులు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. రెండు రోజుల క్రితం సీపీఐని వీడి కేటీఆర్‌ ఆధ్వర్యంలో ‘కారు’ ఎక్కిన కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు గురువారం బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఆ పార్టీ అభ్యర్థి వనమా గెలుపు కోసం పని చేస్తామని ప్రకటించారు. కొత్తగూడెం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఎడవల్లి కృష్ణ ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారు. అభిమానులతో మాట్లాడి శుక్రవారం తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్ల డించారు. ఆయన గులాబీ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎడవల్లి మద్దతు కోరుతూ కొత్తగూడెం సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గురువారం ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. పీపీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఆదాయపు పన్ను శాఖ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు ఓ వైపు ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.

గురువారం దాఖలైన నామినేషన్లు ఇలా..

నియోజకవర్గం అభ్యర్థులు

పినపాక 13

ఇల్లెందు 19

కొత్తగూడెం 22

అశ్వారావుపేట 15

భద్రాచలం 14

మొత్తం 83

Advertisement
 
Advertisement