ఏరు ఉత్సవానికి ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఏరు ఉత్సవానికి ఏర్పాట్లు

Dec 24 2025 4:08 AM | Updated on Dec 24 2025 4:08 AM

ఏరు ఉ

ఏరు ఉత్సవానికి ఏర్పాట్లు

పర్యాటకంలో జోష్‌ నింపుతున్న వేడుక

ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్‌

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో ప్రచారం

భద్రాచలం: పర్యాటక రంగంలో ఏరు ఉత్సవం జోష్‌ నింపుతోంది. ఆధ్యాత్మికత, ప్రకృతిని అనుసంధానిస్తూ పర్యాటక రంగానికి సరికొత్త శోభ నింపేలా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రణాళికలు రూపొందించారు. గతేడాది ప్రారంభించిన ఈ ఉత్సవాన్ని ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. అయితే దీన్ని నిరంతరం కొనసాగించాలని పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు. మొక్కుబడిగా కాకుండా శాశ్వత పనులు చేపడితే అనేక మందికి ఉపాధి లభిస్తుందని అంటున్నారు.

ప్రత్యేకంగా నిలుస్తున్న గిరిజన సంస్కృతి..

ఏజెన్సీ ప్రాంతంగా పేరుగాంచిన జిల్లా సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నెలవు. అలాగే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం రామాలయం ఉంది. వీటితో పాటు గిరిజన సంసృతి సంప్రదాయాలు ఇక్కడ ప్రత్యేకం. వీటన్నింటినీ అనుసంధానం చేస్తూ కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఏరు ఉత్సవం చేపట్టారు. గతేడాది ముక్కోటి వేడుకల సమయంలో చేపట్టిన ఈ ఉత్సవానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఆ తర్వాత పర్యవేక్షణ లేక ఆదరణ కోల్పోయింది. మళ్లీ ఈ ఏడాది ముక్కోటి ఉత్సవాలు ఆరంభం కావడంతో ఏరు ఉత్సవాన్ని తిరిగి చేపట్టారు.

30 వరకు ప్రత్యేక ప్రణాళికతో కార్యాచరణ..

ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక ప్రణాళికతో కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలో సోమవారం బెండాలపాడులోని కనకగిరి గుట్టల ట్రెక్కింగ్‌, మంగళవారం గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కిన్నెరసాని నది పొడవునా రివర్‌ వాక్‌ చేపట్టారు. బుధవారం పాల్వంచలోని శ్రీనివాసగిరి గుట్ట ట్రెక్కింగ్‌, 26వ తేదీ సాయంత్రం దుమ్ముగూడెం మండలం బొజ్జిగుప్పలో ట్రైబల్‌ ఈవెనింగ్‌ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇక ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా 27, 28, 29వ తేదీల్లో గోదావరి ఒడ్డున సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటితో పాటు భక్తులు, పర్యాటకుల వసతి కల్పించి ప్రకృతి, గోదావరి అందాలను తెలకించేలా ఏరు క్యాంప్‌ సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం టెంట్లు, వ్యూ పాయింట్‌, వాష్‌రూంల పనులు గోదావరి ఒడ్డున వేగంగా సాగుతున్నాయి. అలాగే కరకట్ట పైనుంచి ఈ క్యాంపునకు వచ్చేలా నూతన మెట్లు నిర్మిస్తున్నారు.

సోషల్‌ మీడియాతో ప్రచారం..

జిల్లాలోని అందాలు, ఏరు ఉత్సవం, పర్యాటక రంగాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేలా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను భాగస్వాములను చేయాలని కలెక్టర్‌ భావించారు. ప్రత్యేక రీల్స్‌ చేయాలంటూ వారితో ఇటీవల సమావేశం నిర్వహించారు. టూరిజం అభివృద్ధితో అందరికీ ఉపాధి కలుగుతుందని వివరించారు. కాగా జిల్లాను ఎకో టూరిజం హబ్‌గా మార్చేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని ప్రకృతి, పర్యాటక ప్రేమికులు, స్థానికులు కోరుతున్నారు. కేవలం శీతకాల, ముక్కోటి ఉత్సవాలకే పరిమితం కాకుండా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేసేలా ఒత్తిడి తేవాలని అంటున్నారు.

ఏరు ఉత్సవానికి ఏర్పాట్లు1
1/1

ఏరు ఉత్సవానికి ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement