గ్లోబల్ సంస్థగా సింగరేణి
● 2047 వరకు విజన్ డాక్యుమెంట్ ● రాష్ట్రాభివృద్ధిలో సంస్థ భాగస్వామ్యం ● ఆవిర్భావ వేడుకల్లో డైరెక్టర్(ఆపరేషన్ ్స) సూర్యనారాయణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణకు తలమానికమైన సింగరేణి గోబల్ సంస్థగా ఎదుగుతోందని, 2047 వరకు విజన్ డాక్యుమెంట్ ఉందని సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ చెప్పారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఆవిర్భావ వేడుకలను ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. పతాకావిష్కరణ అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 136 సంవత్సరాల చరిత్రలో అనేక విజయాలు సాధించిన సింగరేణి.. కార్మికుల శ్రేయస్సుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఉద్యోగులు, కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులకూ బీమా సౌకక్యం కల్పించినట్లు చెప్పారు. తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమగా విరాజిల్లుతూ రాష్ట్ర అభివృద్ధిలోనూ భాగస్వామ్యం అవుతోందని అన్నారు. శ్రమ, క్రమశిక్షణ, నమ్మకమే సింగరేణి బలమని అన్నారు. కీలక ఖనిజాలు, అనుబంధ రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా డైరెక్టర్లు కె.వెంకటేశ్వర్లు(పీఅండ్‌పీ), ఎం.తిరుమలరావు(ఈఅండ్‌ఎం) హాజరయ్యారు.
ఉత్తమ ఉద్యోగులకు సన్మానం..
సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్పొరేట్ పరిధిలో ఉత్తమ అధికారిగా ఎంపికై న బి.శ్రీనివాసరావు, ఉత్తమ ఉద్యోగులు కె.వేంకటేశ్వర ప్రసాద్, డి.వి.వి. నాగేంద్ర ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రధాన ఆస్పత్రిలో నిర్వహించిన వెల్ బేబీ షోలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. పర్సనల్ జీఎం జి.వి.కిరణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి.త్యాగరాజన్, సీఎంఓఏఐ ప్రెసిడెంట్ టి. లక్ష్మీపతిగౌడ్‌తో పాటు వివిధ విభాగాల జీఎంలు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించకపోవడాన్ని నిరసిస్తూ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ హాజరు కాలేదు.


