ప్రకృతి అందాలు అద్భుతం
కిన్నెరసానిని సందర్శించిన
ట్రెయినీ ఐపీఎస్‌లు
పాల్వంచరూరల్ : కిన్నెరసాని ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయని నలుగురు ట్రెయినీ ఐపీఎస్‌లు కితాబిచ్చారు. మంగళవారం వారు కిన్నెరసానిని సందర్శించారు. అభయారణ్యంలో జంతవుల సంరక్షణ, అటవీ సంపద గురించి తెలుసుకున్నారు. ఇక్కడ ప్రకృతి అందాలు ‘సో బ్యూటీఫుల్’గా ఉన్నాయని చెప్పారు. ఐపీఎస్ శిక్షణలో భాగంగా తాము ఇక్కడికి వచ్చామని హైదరాబాద్‌కు చెందిన రాహుల్, మనీషా నెహరా, సోనమ్ సునీల్, ఆయేషా ఫాతిమా వెల్లడించారు. అనంతరం బోటు షికారు చేశారు. వారి వెంట పట్టణ ట్రాఫిక్ ఎస్‌ఐ జీవన్ ఉన్నారు.
క్రీడలతో మానసిక
ప్రశాంతత
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలంటౌన్ : క్రీడలు శరీర ఆరోగ్యానికే కాకుండా మానసిక ప్రశాంతత, మేధాశక్తి పెంపునకు దోహదం చేస్తాయని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. భద్రాచలం ట్రైబల్ మ్యూజియం ఆవరణలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, ఓడిన వారు నిరుత్సాహపడకుండా పట్టుదలతో కృషి చేసి విజయం సాధించాలని సూచించారు. క్రీడాకారులు రోజూ సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. మ్యూజియం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 32 జట్లు పాల్గొంటున్నాయని, బుధవారం ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.8 వేలు, ద్వితీయ బహుమతి రూ.6 వేలు, తృతీయ బహుమతి రూ.4వేలు, నాలుగో బహుమతి రూ.2వేలతో పాటు ట్రోఫీలు అందజేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ స్పోర్ట్స్ అధికారి గోపాల్ రావు, ఆర్గనైజర్ సురేష్ కుమార్, నాగేశ్వరరావు, పీడీలు, పీఈటీలు హరికృష్ణ, ముత్తయ్య, రాంబాబు పాల్గొన్నారు.
ఆకట్టుకుంటున్న
‘ఐటీడీఏ’ స్టాళ్లు
భద్రాచలంటౌన్ : విశాఖపట్టణం పోర్టు స్టేడియంలో జరుగుతున్న జాతీయ స్థాయి పెసా మహోత్సవాల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన వంటకాలు, కోయ హ్యాండీక్రాఫ్ట్ స్టాళ్లు ఆకట్టుకుంటున్నాయని పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు తెలంగాణ తరఫున ఐటీడీఏ నుంచి క్రీడాకారులను, వివిధ స్టాళ్లను పంపామని చెప్పారు. గిరిజన వంటకాలు, కోయ హ్యాండీక్రాఫ్ట్ స్టాళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు సందర్శించి అభినందించారని వివరించారు. క్రీడల్లో ఐటీడీఏ క్రీడాకారులు సత్తా చాటుతున్నారని తెలిపారు. విశాఖపట్టణం వెళ్లిన వారిలో ఏపీఓ డేవిడ్‌రాజ్, ఏఓ సున్నం రాంబాబు, జ్యోతి తదితరులు ఉన్నారని పేర్కొన్నారు.
ప్రకృతి అందాలు అద్భుతం


