పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం
‘కిన్నెరసాని వాక్’లో కలెక్టర్
జితేష్ వి.పాటిల్
గుండాల: కిన్నెరసాని నది, ఏరు పరీవాహక ప్రాంతాల సహజ సౌందర్యాన్ని కాపాడుతూ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వెల్లడించారు. ఏరు –2025 ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆయన ఆళ్లపల్లి మండలం రాయిపాడు కిన్నెరసాని నదిలో నిర్వహించిన ‘కిన్నెరసాని వాక్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి కిన్నెరసాని వాగులో పూజలు చేసి, ప్రకృతి అందాలను తిలకిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో నడిచారు. అనంతరం ఇసుక తిన్నెలపై ఏర్పాటు చేసిన సమావేశంలో నదులు, ఏరుల ప్రాముఖ్యతను వివరించారు. రాయిపాడు కిన్నెరసాని వాగును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే వేసవిలో విద్యార్థులకు, పర్యాటకులకు ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో ట్రెయినీ ఐఏఎస్ సౌరభ్‌శర్మ, డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి, తహసీల్దార్ జగదీశ్వర్ ప్రసాద్, ఎంపీడీఓ శ్రీను, ఎంఈఓ శాంతారావు, సర్పంచ్ చిన్నపాపయ్య, రేవంత్, కృష్ణయ్య, వరుణ్ పాల్గొన్నారు.
15 రోజుల్లో భూసేకరణ చేయాలి..
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ, డేటా మ్యాపింగ్ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ, సీతమ్మసాగర్ ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. ఓటరు జాబితాలో ఉన్న డూప్లికేట్ ఎంట్రీలు, బ్లర్ ఫొటోలు, ఇతర లోపాలను గుర్తించి నిబంధనల ప్రకారం సరిచేయాలని సూచించారు. ఏఈఆర్‌ఓలు తమ పరిధిలోని బీఎల్‌ఓలకు లక్ష్యాలు నిర్దేశించాలని, మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. తహసీల్దార్లు బుధవారం ఎక్కువ, తక్కువ ఓటర్లు గల పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులొస్తే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు సంబంధించిన భూసేకరణను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. అన్నపురెడ్డిపల్లి, బూర్గంపాడు, అశ్వాపురం, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, జూలూరుపాడు, కొత్తగూడెం, ములకలపల్లి, పాల్వంచ, సుజాతనగర్ మండలాల్లో అవసరమైన భూసేకరణ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు మండలాల్లోని 30 గ్రామాల్లో భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎస్‌డీసీ కాశయ్య, ఎన్నికల సూపరింటెండెంట్ రంగాప్రసాద్, భూసేకరణ సిబ్బంది యాసిన్, ఎన్నికల శిక్షకుడు సాయికృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


