ఇసుక దందాపై హైకోర్టు కొరడా | - | Sakshi
Sakshi News home page

ఇసుక దందాపై హైకోర్టు కొరడా

Sep 30 2026 1:46 AM | Updated on Sep 30 2026 1:46 AM

ఇసుక దందాపై హైకోర్టు కొరడా రేయింబవళ్లు తరలింపు

చీరాల మండలంలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు.. రవాణా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లిన వ్యవహారం సిండికేట్‌పై గత నెలలో అధికారులకు సీఎం హెచ్చరిక అయినా ఆగని మాఫియా ఆగడాలు హైకోర్టులో మాజీ ప్రజాప్రతినిధి పిల్‌ తీసుకున్న చర్యలపై నివేదికకు సీజే ఆదేశం

ఇసుక దందాపై హైకోర్టు కన్నెర్ర చేసింది. అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకునేందుకు తీసుకున్న చర్యలపై నివేదిక తయారీకి సీజే ఆదేశాలు జారీ చేశారు. గత నెలలో జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సభ సాక్షిగా ఇసుక మాఫియా వ్యవహారాన్ని ప్రజలే చెప్పారు. పరిస్థితిని నియత్రించాలని అధికారులను సీఎం ఆదేశించారు. తమ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులే అసలు సూత్రధారులైనా వారి ప్రస్తావన తీసుకురాలేదు. అయినప్పటికీ పరిస్థితి ఏమాత్రం మారలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ప్రజాప్రతినిధి హైకోర్టులో పిల్‌ దాఖలు చేయడంతో హైకోర్టు మొత్తం వ్యవహారంపై నివేదిక కోరింది.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: గత నెలలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో నిర్వహించిన సభలో అనూహ్యంగా సీఎం చంద్రబాబు ఇసుక ప్రస్తావన తెచ్చారు. అందుకు ప్రజలు తమకు ఇసుక అందుబాటులో లేదని నిండు సభలోనే నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే, ఎంపీలు నిర్ఘాంతపోయారు. ‘‘జిల్లాలో మైనింగ్‌ శాఖ పనితీరు సరిగా లేదు. ఇక్కడేమైనా సిండికేట్‌లు ఉన్నాయా.. ఇసుక దొంగ వ్యాపారం జరుగుతోందా..? ఇక్కడ ప్రజల్లో ఇసుక విషయంలో సంతృప్తి లేదు. మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఒక నెల సమయం ఇస్తున్నా, మళ్లీ సమీక్ష చేస్తా... నేరుగా ఇసుక రీచ్‌కే వచ్చి అక్కడ పంచాయితీ పెట్టి ఎవరు తప్పు చేసినా వారిని వదిలిపెట్టను. ఇసుక మాఫియా ఉందా?’’ అంటూ ప్రజలను ప్రశ్నించారు. అందుకు ప్రజల నుంచి ‘ఉంది’ అంటూ సమాధానం రావడంతో చంద్రబాబు సైతం అవాక్కయ్యారు. తమ పార్టీ ఎమ్మెల్యే, వారి అనుచరులు చేసే ఇసుక దందాను వదిలేసి అధికారులపై హెచ్చరికలు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత జరిగినా ఇసుక మాఫియా మాత్రం తవ్వకాలు ఆపలేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇష్టారాజ్యంగా తవ్వకాలు

బాపట్ల జిల్లాలో చీరాల, బాపట్ల నియోజకవర్గాలు తీర ప్రాంతానికి సమీపంలో ఉన్నాయి. తీర ప్రాంతంలో ఇసుక భూములు కావడంతో అధికారపార్టీకి చెందిన అక్రమార్కులకు ఇసుక కల్పతరువుగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఇష్టారాజ్యంగా ఇసుకను కొల్లగొడుతూ జేబులు నింపుకొంటున్నారు. ప్రభుత్వం తమదని, ఏం చేసినా ప్రజాప్రతినిధి చూసుకుంటారనే ధీమాతో కొందరు ఇసుకను ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. మండలంలోని కావూరివారిపాలెం పంచాయతీలోని తులసీనగర్‌లోని ఓ రొయ్యల ఫ్యాక్టరీ సమీపంలో అక్రమ తవ్వకాలు జరిగాయి. కావూరివారిపాలెం పంచాయతీలోని తులసీనగర్‌.. బాపట్ల నియోజకవర్గానికి సరిహద్దుగా ఉంది. దీంతో సుమారు 80 ఎకరాల్లో అసైన్డ్‌ భూముల్లో అడ్డూ అదుపు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టారు. అసైన్డ్‌ భూముల్లో సుమారు 40 అడుగుల మేర ఇసుక తవ్వకాలు చేయడంతో ఆ ప్రాంతమంతా చెరువులా మారింది. చీరాల ఎమ్మెల్యే, బాపట్ల ఎమ్మెల్యే అనుచరులు యథేచ్ఛగా ఇసుక కొల్లగొడుతున్నారు. గ్రామస్తులు కూడా అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని, గ్రామంలో టిప్పర్లు యథేచ్ఛగా తిరుగుతుండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు. ఇసుక తవ్వకాల వల్ల భవిష్యత్తులో చుట్టుపక్కల ప్రాంతాల రైతుల సారవంతమైన భూములు వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయని రెవెన్యూ, మైనింగ్‌ అధికారులకు విన్నవించారు.

నామమాత్రంగా చర్యలు

ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ జూలై నెలలో కావూరివారిపాలెంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు జరిగిన భూమిని పరిశీలించారు. అదే సమయంలో అక్రమార్కులు ఇసుక తరలించేందుకు సిద్ధంగా ఉన్న టిప్పర్లను అక్కడే వదిలేసి పరారయ్యారు. దీంతో ఆయన మైనింగ్‌, ఆర్డీఓకు ఫిర్యాదు చేయడంతో తూతూమంత్రంగా టిప్పర్లు, క్రేన్‌లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సూత్రధారులను వదిలేసి పాత్రధారులపై చర్యలు తీసుకోవడం సరికాదంటూ ఇసుక అక్రమ తవ్వకాలపై ఆయన హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇసుక తవ్వకాలపై మైనింగ్‌ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై లిఖితపూర్వకంగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు సీజే ఆదేశించినట్లు తెలిసింది.

పేరుకే ఉచిత ఇసుక డిపో...

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో ఉచిత ఇసుక పాలసీని అమలు చేసింది. తక్కువ ధరకు నాణ్యమైన ఇసుకను అందజేస్తామని సీఎం చంద్రబాబు బీరాలు పలికారు. అయితే చీరాల నియోజకవర్గం.. ప్రభుత్వం ప్రకటించిన అధీకృత ఇసుక రీచ్‌ల జాబితాలో లేదు. ఈ నేపథ్యంలో 2024 జూలై మొదటి వారంలో వేటపాలెం మండలం నాయినిపల్లి పరిధిలో ప్రభుత్వ ఉచిత ఇసుక డిపోను ఏర్పాటు చేశారు. రీచ్‌లు ఉన్న ప్రాంతాల నుంచి ఇసుకను డంప్‌ చేశారు. ఏమైందో ఏమో కానీ, అది మూణ్నాళ్ల ముచ్చటయ్యింది. అధికారపార్టీ నేతల ఇసుక దందాకు అడ్డుగా ఉందనే కారణంతో కొద్ది రోజులకే డిపోను తీసేశారు.

కప్పం చెల్లించే ట్రాక్టర్లకు ఓకే

కప్పం చెల్లించే ట్రాక్టర్లకు పచ్చజెండా ఊపారు. అందుకు ఆర్థికపరమైన వ్యక్తిగత ప్రయోజనాలు పని చేశాయనేది బహిరంగ రహస్యం. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరగడం అందుకు నిదర్శనం. జిల్లాలో కొల్లూరు, జువ్వెలదిన్నెలో మాత్రమే అధీకృత ఇసుక రీచ్‌లు ఉన్నాయి. చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లో భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా సాగుతోంది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. వాస్తవానికి సొంతిల్లు నిర్మాణానికి సంబంధించి ఆ ప్రాంత తహసీల్దార్‌ నుంచి అనుమతి తీసుకుని ఎడ్లబండ్లు లేదా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించుకోవచ్చు. అక్రమార్కుల ఆధీనంలో ఇసుక వ్యవస్థ బందీ అయ్యింది. దీంతో సొంతింటి అవసరాలకు కూడా ఇసుకను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకాసురులు బరితెగించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు సుమారు రూ.50 కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని అనధికార అంచనా. అధికార పార్టీ కీలక నేతల అండదండలతోనే అక్రమ దందా నడుస్తోంది. అధికారులకూ వాటాలు ఉండడంతో చీరాల వైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు. అక్రమంగా మైనింగ్‌కు పాల్పడుతూ ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్న ఇసుకాసురులపై విలేకరి నాయుడు నాగార్జునరెడ్డి పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. మైనింగ్‌ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణకు వచ్చిన అధికారుల సమక్షంలోనే నాయుడు నాగార్జునరెడ్డిపై ఇసుక మాఫియాను నడిపిస్తున్న కొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం అందరికీ తెలిసిందే. గత నెలలో నేతన్న సేవలో పథకం ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు చీరాలకు వచ్చిన నేపథ్యంలో ఇసుక దందా నిర్వహించే వారు.. పచ్చ నేతలతోపాటు తమ ఫొటోలనూ చేర్చి ఫ్లెక్సీలు వేయించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement