చేబ్రోలు: ‘మానవత్వం మంట గలిసింది’ శీర్షికన సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మలు జరిగిన సంఘటనపై విచారణ జరిపి నివేదికలను అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. వికలాంగురాలైన గర్భిణి పురిటినొప్పులతో ఆర్‌టీసీ బస్సులో ప్రసవం, అనంతరం జరిగిన సంఘటనలపై మంగళవారం జిల్లా వైద్యశాఖాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. తెనాలి డిప్యూటీ డీఎంహెచ్‌వో కే అన్నపూర్ణమ్మ చేబ్రోలు పీహెచ్‌సీలో రాత్రి సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బందిని విచారణ జరిపి నివేదికను తయారు చేసి డీఎంహెచ్‌వో కే విజయలక్ష్మికి అందజేశారు. బాపట్ల జిల్లా ముత్తాయపాలేనికి చెందిన అంగిరేకుల లావణ్య గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులో ఇంటికి వెళ్తూ ప్రసవించింది. చేబ్రోలు పీహెచ్‌సీకి రాత్రి సమయంలో అక్కడకు వచ్చిన తరువాత తల్లీబిడ్డలను పరీక్షించి, బిడ్డ బొడ్డుతాడు కత్తిరించి, ప్రసవానంతర సేవలు అందించి గంటపాటు నియోనేటల్ వార్మర్‌లో ఉంచి మెరుగైన వైద్య సేవల నిమిత్తం 108 వాహనంలో గుంటూరు పంపినట్లు చేబ్రోలు వైద్య సిబ్బంది డిప్యూటీ డీఎంహెచ్‌వోకు వివరించారు. మహిళకు వైద్య సేవలు అందించిన తీరును ఆమెకు తెలిపారు.
బస్సులోని వారు దిగి వెళ్లిపోయారు...
చీరాల డిపోకు చెందిన బస్సులో డ్రైవర్, కండక్టర్ నిర్లక్ష్య వైఖరి పట్ల డిపో మేనేజర్ విచారణ జరిపారు. చీరాల డిపోకు చెందిన బి యువరాజ్, టి సతీష్‌లు బస్సు డ్రైవర్, టిమ్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడ నుంచి చీరాల వెళ్తున్న బస్సులో గుంటూరులో గర్భిణి మహిళ ఎక్కినట్లు వారు విచారణలో తెలిపారు. బస్సులో 107మంది ప్రయాణికులు ఉన్నారని, నారాకోడూరు వద్ద పురిటి నొప్పులు వచ్చినట్లు తెలిపారు. హాస్పటల్‌కు వెళ్తామని చెప్పటంతో నారాకోడూరు వద్ద ఆపటంతో దిగి వెళ్లిపోయారని వారు విచారణలో తెలిపినట్లు చీరాల ఆర్‌టీసీ డిపో మేనేజర్ తెలియజేశారు.


