రూ. 9 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
మార్టూరు(యద్దనపూడి): మార్టూరు మండలంలోని బొల్లాపల్లి గ్రామ వీఆర్వో తేళ్ల చిన్న ఆంజనేయులను మంగళవారం అవినీతి నిరోధకశాఖాధికారులు వలపన్ని పట్టుకున్నారు. గుంటూరు ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని బొల్లాపల్లి, తాటివారిపాలెం పంచాయతీలకు ఆంజనేయులు గత రెండు సంవత్సరాలుగా వీఆర్వోగా పనిచేస్తున్నాడు. రైతుల నుంచి విపరీతంగా లంచాలు వసూలు చేస్తాడని ఆంజనేయులుకు పేరుంది. ఈ క్రమంలో తాటివారిపాలెం గ్రామానికి చెందిన రైతు ధూళ్లిపాళ్ల సుబ్బారావు తన తండ్రి మరణించగా ఆయన పేరిట ఉన్న వ్యవసాయభూమిని అతనికి, అతని సోదరి వెంకాయమ్మల పేరుతో ఆన్‌లైన్ చేయాల్సిందిగా గత రెండు నెలలుగా వీఆర్వో ఆంజనేయులను రైతు సుబ్బారావు సంప్రదిస్తున్నాడు. ఆగస్టు నెల 12వ తేదీ బొల్లాపల్లి సచివాలయంలో మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వీఆర్వో ఆంజనేయులు.. రూ.10 వేలు లంచం ఇస్తే కానీ భూమి ఆన్‌లైన్ చేస్తానని సుబ్బారావుతో చెప్పాడు. లంచం ఇచ్చి పనిచేయించుకోవడం ఇష్టం లేని రైతు సుబ్బారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు సదరు వీఆర్వోపై నిఘా పెట్టారు. అందులో భాగంగా రూ.9 వేలకు బేరం కుదుర్చుకున్న రైతు సుబ్బారావు ఏసీబీ వారు అందించిన కెమికల్స్ పూసిన రూ.9 వేల సమానమైన 500 రూపాయల 18 నోట్లను సిద్ధం చేశాడు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రైతు సుబ్బారావు నుంచి వీఆర్వో ఆంజనేయులు స్వయంగా నగదు తీసుకుంటుండగా సమీపంలో మాటు వేసిన డీఎస్పీ ప్రతాప్‌కుమార్ బృందం సదరు వీఆర్వోను అదుపులోకి తీసుకొని తహసీల్దారు కార్యాలయానికి తీసుకువచ్చారు. డీఎస్పీ ప్రతాప్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ అధికారులు లంచం అడిగితే 1064 నంబరును సంప్రదించాలని కోరారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఏసీబీ సీఐ కె.శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


