గ్రామీణ రోగులకు వైద్యం అందక అగచాట్లు | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ రోగులకు వైద్యం అందక అగచాట్లు

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

గ్రామీణ రోగులకు వైద్యం అందక అగచాట్లు

డీఎంహెచ్‌ఓ దృష్టి సారించాలి...

వైద్యులపై కొరవడిన పర్యవేక్షణ

● ఆరోగ్య కేంద్రాల్లో

అందుబాటులో ఉండని వైద్యులు

● ప్రభుత్వ ఆసుపత్రుల్లో

అటకెక్కిన ‘ప్రసవాలు’

● నూతన డీఎంహెచ్‌ఓ

దృష్టి సారిస్తేనే పేదలకు మేలు

గుంటూరు మెడికల్‌ : ఉమ్మడి ఏపీలో గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో వరుసగా మూడు సార్లు ప్రథమ స్థానంలో నిలిచి అరుదైన రికార్డు నెలకొల్పింది. కాలక్రమేణా జిల్లా వైద్య రంగం తన ప్రభావాన్ని కోల్పోతోంది. ఆరోగ్య కార్యక్రమాల అమలులో ముందుండాల్సిన జిల్లా పాతాళానికి పడిపోతోంది. గత ఆరు నెలలుగా ప్రభుత్వం విడుదల చేసిన నివేదికల్లో జిల్లా స్థాయి కిందికి పడిపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం అందక రోగులు అవస్థలు పడుతున్నారు. వైద్యులు అందుబాటులో ఉండటం లేదు.

పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయని వైనం

జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండక ప్రసవాలు చేయడం తగ్గిపోయింది. సాధారణ కాన్పు కోసం కూడా గుంటూరు జీజీహెచ్‌కు గర్భిణీలు పరుగులు తీయాల్సి వస్తోంది. కొంతమంది కాన్పు కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి సిజేరియన్‌ ఆపరేషన్‌కు రూ. లక్ష వరకు ఖర్చు అవుతుండటంతో, అంత ఖర్చు భరించలేక పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అక్రమ డెప్యూటేషన్లు కూడా...

ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించాల్సిన డీఎంహెచ్‌ఓ, ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు తమ విధులను నిర్వహించకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోయినట్లు విమర్శలు ఉన్నాయి. అందువల్లే ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు సేవలందించకుండా సొంత వ్యవహారాల్లో మునిగిపోతున్నారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జిల్లా వైద్య అధికారులు కొంతసేపు ఫైల్స్‌ తనిఖీలు చేసి, అనంతరం కార్యాలయంలో ఉండకుండా సొంత వ్యవహారాల్లో మునిగితేలుతున్నారు. జిల్లా మలేరియా అధికారి పనితీరుపై ఉద్యోగ సంఘాల నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మలేరియా అధికారి విధుల్లో ఉండకుండా సొంత పనుల్లో మునిగితేలుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా ఎయిడ్స్‌, లెప్రసీ అధికారి రిక్రూట్‌మెంట్‌ల సమయంలో అభ్యర్థుల నుంచి రూ. లక్షల్లో మామూళ్లు తీసుకుంటూ అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చాడని జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది డెప్యూటేషన్‌ల పేరుతో డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో తిష్టవేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు లేకుండా డెప్యూటేషన్‌లపై డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పాతుకుపోయిన వారిపై నూతన డీఎంహెచ్‌ఓ దృష్టి సారించి కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని పలువురు ఉద్యోగులు, వైద్య ఉద్యోగుల సంఘ నేతలు కోరుతున్నారు. కార్యాలయంలో పలు ఫైల్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. కార్యాలయ ఉద్యోగులు ఫైల్స్‌ క్లియరెన్స్‌కు మామూళ్లు అడుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయ ఉద్యోగులు పనివేళలు పాటించడం లేదు. సంతకాలు పెట్టి బయటకు వెళ్లిపోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి వచ్చే వైద్య ఉద్యోగులు, ప్రజలు సైతం కార్యాలయ ఉద్యోగులు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా డాక్టర్‌ మక్కెన పద్మావతి బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన డాక్టర్‌ పద్మావతి గుంటూరు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదివారు. జిల్లాలోని పీహెచ్‌సీల్లో పనిచేశారు. గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారిగా, జిల్లా శిక్షణ సంఘం ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌గా పనిచేసి తన పనితీరుతో జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా బెస్ట్‌ మెడికల్‌ ఆఫీసర్‌, ఉత్తమ జిల్లా ఆఫీసర్‌ అవార్డులు సైతం అందుకున్నారు. జిల్లాలో సుమారు 25 ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్‌ పద్మావతిని డీఎంహెచ్‌ఓగా నియమించడంతో జిల్లా వైద్య రంగం గాడిన పెట్టాలని జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని పీహెచ్‌సీలను 24 గంటల ఆసుపత్రులుగా మార్చేశారు. ప్రతి పీహెచ్‌సీకి ముగ్గురు చొప్పున వైద్యులను నియమించడంతో పాటు, 24 గంటలూ అందుబాటులో ఉండేలా ముగ్గురు స్టాఫ్‌ నర్సులను, నైట్‌ వాచ్‌మెన్‌ విధుల నిర్వహణకు కింది స్థాయి సిబ్బందిని సైతం నియమించారు. ఆసుపత్రుల్లో 24 గంటలూ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించేలా పర్యవేక్షణ అధికారులను సైతం నియమించారు. అయితే పలు ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. సొంత ప్రాక్టీస్‌ల్లో మునిగితేలుతున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ఉన్నారా, లేరా అని పర్యవేక్షణ చేయటంలో జిల్లా వైద్యాధికారులు విఫలమవ్వడంతో జిల్లా వైద్య రంగం నేడు కింది స్థాయికి పడిపోయినట్లు విమర్శలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement