దంచిన వాన.. | - | Sakshi
Sakshi News home page

దంచిన వాన..

Sep 26 2026 2:02 AM | Updated on Sep 26 2026 2:02 AM

ముంచిన వరద

లోతట్టు ప్రాంతాల గృహాల్లోకి వర్షపు నీరు

జలమయమైన రహదారుల్లో రాకపోకలకు తిప్పలు

కొల్లూరు: ఆకాశానికి చిల్లు పడినట్లు కురిసిన భారీ వర్షానికి పచ్చటి పంట పొలాలు ఏరులయ్యాయి. బుధ, గురు వారాలలో చినుకు పడినట్లుగా ఉండటంతోపాటు గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం తాకిడికి ఖరీఫ్‌లో సాగు చేసిన వందలాది ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. తీవ్ర వాయుగుండం తీరం దాటిన అనంతరం కురిసిన కుండపోత వర్షానికి తోడు పెనుగాలులు వీయడంతో వృక్షాలు నేలకొరిగాయి. వర్షం తీవ్రతకు రహదారులు జలమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. పల్లపు ప్రాంతాలలోని గృహాలలోకి వర్షపు నీరు చొచ్చుకుపోయి ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు.

రైతుల ఆవేదన

మండలంలో రేపల్లె డివిజన్‌లోనే అత్యధికంగా 84.60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం సైతం డివిజన్‌లో కొల్లూరులోనే అధికంగా 78.40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మండలంలో 12 వేల ఎకరాలలో ఖరీఫ్‌లో భాగంగా వరి సాగవుతుండగా, చినపులివర్రు ప్రాంతంలో సుమారు 300 ఎకరాలకు పైబడి వరి పంట ముంపు బారిన పడటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి పొలాల్లో వరి కానరాకుండా జలాశయాలను తలపించేలా నీరు నిలిచిపోవడంతో పంట పనికివస్తుందో లేదోనన్న ఆందోళన రైతులలో ఉంది. ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలు పొంగి పొర్లుతుండటంతో పంట పొలాల్లోని నీరు త్వరితగతిన బయటకు పోకుంటే పంట నష్టం తప్పదన్న ఆవేదనలో అన్నదాతలు ఉన్నారు. ఖరీఫ్‌లో సాగైన వరిలో 60 శాతానికి పైబడిన పంట పొలాల్లో వర్షపు నీరు అవసరానికి మించి చేరింది. పంటకు వేసిన ఎరువులు వృథాగా పోయాయి. ఎరువులు మళ్లీ వేయాల్సి వస్తే ఆర్థిక భారం పడుతుందని రైతులు వాపోతున్నారు. మెట్ట ప్రాంతంలో సాగు చేస్తున్న మినప పంటకు వర్షం కారణంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు. వాణిజ్య పంటలైన అరటి, పసుపు, కంద, తమలపాకు, జామ, ఇతర కూరగాయల పంటలకు మాత్రం వర్షం వల్ల మేలు చేకూరనుంది.

గాలుల ప్రభావానికి దోనేపూడి – పోతార్లంక మార్గంలో భారీ వృక్షం నేలకూలడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆ మార్గంలో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మండలంలోని కొల్లూరు ఎస్సీ కాలనీ, కోటిపల్లి తదితర ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో గృహాలలోకి నీరు ప్రవేశించింది. కొల్లూరు గౌడపాలెంలో రేపల్లె – తెనాలి ప్రధాన మార్గంతోపాటు, గ్రామాలలోని డ్రైనేజీ వ్యవస్థలు అధ్వానంగా మారడంతో అంతర్గత రోడ్లపై వర్షపు నీరు నిలిచి కాలువల్లా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement