జెడ్పీ నిధులతో జిల్లా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ నిధులతో జిల్లా అభివృద్ధి

Sep 26 2026 2:02 AM | Updated on Sep 26 2026 2:02 AM

● ప్రత్యేక అధికారి డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ● జెడ్పీ నూతన కార్యాలయం ప్రారంభం

బాపట్ల: జిల్లా ప్రజా పరిషత్‌ నిధులతో జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామని జిల్లా కలెక్టర్‌, జెడ్పీ ప్రత్యేక అధికారి డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. బాపట్ల జిల్లా ప్రజా పరిషత్‌ శుక్రవారం ఏర్పాటైంది. నూతనంగా ఏర్పాటైన బాపట్ల జిల్లా ప్రజా పరిషత్‌కు జిల్లా కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కాగానే జెడ్పీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా పరిషత్‌ నూతన జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా కార్యాలయం ప్రాంగణంలో మొక్క నాటి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రత్యేక అధికారిగా నియమితులైన కలెక్టర్‌కు మంత్రోచ్ఛారణలతో అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. బాపట్ల పార్లమెంట్‌ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్‌, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్రవర్మ అక్కడకు చేరుకుని జిల్లా ప్రత్యేక అధికారి వినోద్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లా పరిషత్‌కు కేటాయించిన నిధులను జిల్లా అభివృద్ధికి సద్వినియోగం చేసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు. బాపట్ల జిల్లాలో జెడ్పీని నూతనంగా ఏర్పాటు చేసుకోవడం సంతోషదాయకమన్నారు. నూతన భవనానికి భూమి కేటాయింపు, భవన నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. జిల్లా పరిషత్‌ ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. జిల్లా ప్రజా పరిషత్‌ ఏర్పాటు ద్వారా జిల్లాలోని ప్రభుత్వం పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని ఎంపీ తెన్నేటి కృష్ణ్ణ ప్రసాద్‌ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనేక పథకాలను అమలు చేయడానికి జడ్పీ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందన్నారు. గ్రామాలలో జల వనరులు పుష్కలంగా ఉండేలా, రహదారుల అభివృద్ధికి కీలకం కానుందన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఆ నిధులను ప్రత్యేకంగా కేటాయించే అవకాశం ఉంటుందన్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర అవసరాలకు జడ్పీ నుంచి నిధుల కేటాయింపు అధికంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ లవన్న, గుంటూరు జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో కృష్ణ, డీపీఓ ప్రభాకరరావు, ఆర్డీవో హరికుమార్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి కుటుంబం నుంచి పారిశ్రామికవేత్త

ప్రతి కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలని బాపట్ల పార్లమెంట్‌ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్‌ అన్నారు. శ్రీ సాయిరాం గ్రాండ్‌ కన్వెన్షన్‌ హాల్‌లో శుక్రవారం జిల్లా పరిశ్రమల శాఖ, ఆంధ్రప్రదేశ్‌ సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ‘వన్‌ ఫ్యామిలీ – వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో 25వేల ఎంఎస్‌ఎమ్‌ఈలు రిజిస్ట్రేషన్‌ అయినట్లు చెప్పారు. రాబోయే సంవత్సరాలలో ఈ సంఖ్య 50 వేలకు చేరాలని ఆకాంక్షించారు. వ్యవసాయం, పర్యాటక, ఆక్వా, ఉద్యానవన రంగాలలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటికి కేంద్ర ప్రభుత్వం నుండి పెద్దఎత్తున నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మంచి యూనిట్లను పెట్టుకొని అంచెలంచెలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఒక కర్మాగారమని, ప్రతి కుటుంబం నుంచి ఒకరు స్వయం ఉపాధి లేదా పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, తమలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి ఉద్యోగాలను సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అన్నారు. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, శిక్షణ కార్యక్రమాలు, సాంకేతిక సహాయం తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ వై.రామకృష్ణ, ఏపీఐఐసీ జనరల్‌ మేనేజర్‌ నరసింహారావు, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనానన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రామాంజనేయులు, డీఆర్‌డీఏ పీడీ సింగయ్య, మెప్మా పీడీ ఆనంద్‌ పాల్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ శివకృష్ణ పాల్గొన్నారు.

నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ

జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నరసాయపాలెంలోని పమిడి అంకమ్మ–డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ గురుకుల బాలికల పాఠశాలలో బాలికలకు నులి పురుగుల నివారణ మాత్రలను జిల్లా కలెక్టర్‌ అందించారు. రాష్ట్ర ఏపీఎస్‌సీపీసీఆర్‌ మెంబర్‌ పద్మలత, ఆర్డీఓ ఏ.హరికుమార్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.విజయమ్మ, డి ఈఓ శ్రీనివాస్‌, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ సువార్త, ప్రిన్సిపాల్‌ వినిత, తహసీల్దార్‌ షేక్‌ సలీమ, ఎంపీడీఓ బాబూరావు, గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement