త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు మిగిలిన వారంతా స్వల్పగాయాలతో బయట పడ్డ ఘటన ఇదే ప్రమాదంలో మరో ఇద్దరు మహిళలకూ తీవ్ర గాయాలు గుంటూరు జీజీహెచ్‌కు తరలింపు
ప్రత్తిపాడు: పాఠశాల విద్యార్థులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆధార్ అప్‌డేట్ కోసం వెళుతున్న విద్యార్థుల ఆటో బోల్తా పడి ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు ఎల్‌ఈ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ఆయా తరగతులకు చెందిన పదమూడు మంది విద్యార్థులకు ఆధార్ అప్‌డేట్ చేయించేందుకు పాఠశాల ఉపాధ్యాయుడు అంకమ్మరావు శుక్రవారం మధ్యాహ్నం పాఠశాల సమయంలో ఆటో ఎక్కించుకుని ప్రత్తిపాడులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్‌కు బయల్దేరాడు. గొట్టిపాడు శివారులో ఆటో డ్రైవర్ వాహనాన్ని అజాగ్రత్తగా నడపుతూ రోడ్డుకు అవతల వైపు నిలబడి ఉన్న వ్యవసాయ కూలీల వైపు ఆటోను నడిపాడు. గమనించిన ఉపాధ్యాయుడు పెద్దగా కేకలు వేయడంతో ఆటో డ్రైవర్ కూలీలను తప్పించబోయాడు. ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి నడిరోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పదమూడు మంది చిన్నారుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తీవ్ర గాయాలపాలైన పిల్లి, సంజయ్, పిల్లి నిరీక్షణ్‌లను ప్రత్తిపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యులు క్షతగాత్రులకు చికిత్స అందించారు. కాగా ఐదవ తరగతి విద్యార్థి సంజయ్ తలకు తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స నిమిత్తం 108లో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మరో విద్యార్థిని కావ్యకు కూడా కాలికి బలమైన గాయాలయ్యాయి. మిగిలిన పదకొండు మంది విద్యార్థులకూ స్వల్ప గాయాలయ్యాయి.
ఉపాధ్యాయుడి అప్రమత్తతతో..
ప్రమాదం జరిగిన వెంటనే ఆటోలో ఉన్న ఉపాధ్యాయుడు అంకమ్మరావు అప్రమత్తమయ్యారు. అప్పటికే కాలికి, చేతులకు గాయాలైనప్పటికీ క్షణాల్లోనే తేరుకున్నారు. ఆటో కింద పడి తీవ్ర భయాందోళనలో ఉన్న విద్యార్థులను కాపాడారు. బోల్తా పడిన ఆటోను పైకి లేపి ఆటో కింద ఇరుక్కుపోయిన విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు పంపారు. దీంతో విద్యార్థులంతా స్వల్ప గాయాలతో బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న మండల విద్యాశాఖాధికారి సీహెచ్ రమాదేవి ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన విద్యార్థుల వివరాలు, వైద్య చికిత్సపై ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులకు సకాలంలో వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. తల్లిదండ్రులకు సమాచారం అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు..
కాగా ఇదే ప్రమాదంలో పొలం పనులకు వెళ్లి వస్తున్న ఇద్దరు మహిళా కూలీలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. గొట్టిపాడుకు గ్రామానికి చెందిన పి.చందన, కె.లక్ష్మీకుమారి రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. వీరి మీదకు ఆటో దూసుకురావడంతో ఇద్దరిలో చందన కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. అలానే లక్ష్మీకుమారికి కూడా నడుము కింద తీవ్రమైన గాయమవ్వడంతో ప్రత్తిపాడు సీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మరైగెన వైద్యం నిమిత్తం ఇద్దరినీ గుంటూరు జీజీహెచ్‌కు 108లో తరలించారు.


