అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

Sep 26 2026 2:02 AM | Updated on Sep 26 2026 2:02 AM

రూ. 33 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు, వాహనాలు స్వాధీనం

బాపట్లటౌన్‌: అంతర్రాష్ట్ర ఘరానా దొంగల ముఠాను చందోలు పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... చందోలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పిట్టలవానిపాలెం గ్రామంలో ఈ ఏడాది జులై 27న రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి మన్నెం గుడేర ఇంటిలోకి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువా పగలగొట్టి బంగారు ఆభరణాలను దొంగిలించారని ఫిర్యాదు రావడంతో చందోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారన్నారు. దర్యాప్తులో భాగంగా రేపల్లె మండలం గుడిపల్లివారిపాలెం గ్రామానికి చెందిన వీరంకి జానకి సతీష్‌బాబు, వీరంకి దావీదులను నిందితులుగా గుర్తించారు. ఈ నెల 24న రాత్రి సమయంలో పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం సెంటర్‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు పల్సర్‌ బైక్‌లతోపాటు రూ. 33 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు.

నిందితులకు నేరచరిత్ర

ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడటంతోపాటు మద్యం, ఇతర వ్యసనాలకు వీరు బానిసైనట్లు గుర్తించామన్నారు. అప్పులు తీర్చుకోవడం, జల్సాల కోసం దొంగతనాల బాట పట్టారు. 2023లో చుండూరు మండలం దిండుపాలెం గ్రామం, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట, నల్గొండ జిల్లా తిప్పర్తి ప్రాంతాల్లో నమోదైన చోరీ కేసుల్లో వీరు జైలుకు వెళ్లారు. బెయిల్‌పై బయటకు వచ్చి దొంగతనాలకు పాల్పడ్డారు. బాపట్ల జిల్లాలోని చందోలు, భట్టిప్రోలు, నగరం, అడవులదీవి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో చోరీలు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనూ చోరీలు చేసినట్లు వెల్లడైంది.

పోలీసులకు ప్రశంసాపత్రాలు

ఈ కేసు దర్యాప్తును బాపట్ల డీఎస్పీ సీహెచ్‌ చంద్రమౌళి పర్యవేక్షణలో బాపట్ల రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి. హరికృష్ణ ఆధ్వర్యంలో చందోలు ఎస్‌ఐ కె. మాధవరావు చేపట్టారు. హెడ్‌ కానిస్టేబుల్‌ వి. శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు డి. సోమయ్య, వై. పేతురు, హోంగార్డ్‌ వై. రామకృష్ణ కీలకంగా వ్యవహరించారు. వీరిని ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌ అభినందించారు. ప్రశంసాపత్రాలతోపాటు క్యాష్‌ రివార్డులతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement