నారుమడిని పశువులకు వదిలేశా
పంట సాగుపై ఆందోళనలో అన్నదాతలు
మండుతున్న ఎండలకు ఎండిపోతున్న పంటలు
నీరు లేక జిల్లాలో తగ్గిన సాగు విస్తీర్ణం
ఇప్పటికే 70 శాతానికిపైగా లోటు వర్షపాతం
బీడు భూములను తలపిస్తున్న పంట పొలాలు
దయనీయ పరిస్థితిలో రైతులు, రైతు కూలీలు
భరోసా ఇవ్వని టీడీపీ సర్కారు
ఎల్‌నినో ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు అన్నదాతల ఆశలు వాడిపోతున్నాయి. ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో పుడమికి పచ్చని రంగు అద్దినట్లు పైర్లతో కళకళలాడే పొలాలు నేడు నెర్రెలిస్తున్నాయి. ఆగస్టులో కురిసిన అరకొర వర్షాలకు వరుణుడు కరుణిస్తాడేమోనన్న ఆశతో సాగు చేసిన రైతుల కళ్లముందే ఇప్పుడు పైర్లు ఎండిపోతున్నాయి. పంట ఎలా కాపాడుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు అడవుల్లో.. పొలాల్లో పచ్చిమేత లేకపోవడంతో మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. బాపట్ల జిల్లాలో ఎన్నడూ చూడని కరువు తరుముకొస్తోంది.
బాపట్ల టౌన్: ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతుల పరిస్థితి దినదినగండంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా విపరీతమైన ఖర్చులు పెట్టాల్సి వస్తోంది. ఆగస్టు మొదటి వారంలో కురిసిన అరకొర వర్షాలతో రైతులు వరిసాగుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడం, కాలువల ద్వారా సరిపడా సాగునీరు సరఫరా కాకపోవడంతో ఎండిపోతున్న పైర్లను కాపాడేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఆయిల్ ఇంజిన్లు, పైపులు అద్దెకు తీసుకొని పొలాలు తడుపుతున్నారు. ఒక్కో ఎకరం తడిపేందుకు రెండు రోజులు పడుతోందని వాపోతున్నారు. గంటకు ఇంజిన్‌కు రూ. 150, పైపుల అద్దె, ఆయిల్ ఖర్చులతో కలిసి గంటకు రూ. 350 చొప్పున చెల్లించాల్సి వస్తోందన్నారు. ఒక్క ఎకరానికి ఒక నీటి తడి అందించేందుకు దాదాపు రూ. 3,500 వరకు ఖర్చవుతోందని వాపోతున్నారు. ఇప్పటికే నాట్లు, కలుపుమందులు, ఎరువులు చల్లినా నీరు లేక పైరు మొత్తం ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మోటార్ల సహాయంతో కూడా నీరు పెట్టే అవకాశం లేని రైతులు కళ్లముందే మాడిపోతున్న పైర్లను ఎలా కాపాడుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
పెరిగిన ఖర్చులతో విలవిల
ప్రతి ఏడాది జూన్, జూలై మాసాలలో వచ్చిన తొలకరి వర్షాల తర్వాత కాలువలకు సాగునీరు విడుదల అయ్యేది. సకాలంలో నాట్లు వేసుకొని పొలాలకు నీరు అందించేవాళ్లు. నీరు లేకపోవడంతో వెద పద్ధతిలో సాగు చేసిన పైర్లు ఎండిపోయి పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో ఇటీవల కురిసిన వర్షాలకు పొలాల్లో నీళ్లు పడటంతో అధిక ధరలు వెచ్చించి నార్లు కొనుగోలు చేసి నాట్లు వేయిస్తున్నారు. ఎకరాకు నాటు వేసేందుకు రూ. 4 వేలు, నారు పీకినందుకు రూ. 3 వేలు, నారు కొనుగోలుకు రూ. 3 వేలు చొప్పున మొత్తం రూ. 10 వేలు ఖర్చయింది. ఇవి కాక ట్రాక్టర్ బాడుగ అదనంగా పెట్టుకోవాల్సి వస్తోంది. రూ. వేలు ఖర్చు చేసి పెట్టిన నీళ్లు ఒక్కరోజునే భూమిలో ఇంకిపోవడంతో ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏటా తరహాలోనే కాలువల ద్వారా సాగునీరు వస్తుందన్న ఆశతో ఆగస్టు మొదటి వారంలో కురిసిన వర్షాలకు నాలుగు ఎకరాల పొలానికి 20 సెంట్ల నారుమడి పోశా. నెలరోజుల పాటు నారుమడికి రెండుపూటలా నీటి తడులు పెట్టుకుంటూ కాపాడుకుంటూ వచ్చాను. ఎంత ప్రయత్నించినా చినుకు పడకపోవడం.. కాలువల ద్వారా నీరు రాకపోవడంతో ఆ నారుమడిని పశువులకు వదిలేశా. 30 ఏళ్ల నా వ్యవసాయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదు. గేదెలకు గడ్డి కూడా లేని కారణంగా రెండింటిని అమ్ముకున్నాను. ప్రభుత్వం మాలాంటి వారిని ఆదుకోవాలి.
– కొసనాటి సుబ్బయ్య,
ఇమ్మడిశెట్టివారిపాలెం
జిల్లా వ్యాప్తంగా గతేడాది సాగు విస్తీర్ణం 1,13,902 హెక్టార్లు కాగా, ప్రస్తుతం 53,774 హెక్టార్లే సాగైంది. అందులోనూ 30 శాతానికిపైగా పంట ఎండిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో రైతుకు భరోసా కరువైంది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు చెల్లించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వమే చెల్లించేది. ప్రస్తుతం రైతులు ఎకరాకు రూ. 760 చొప్పున చెల్లించుకోవాలని చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, అసలు సాగు జరుగుతుందో.. లేదోనన్న సందిగ్ధంలో సగానికిపైగా రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోలేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంటలు మొత్తం ఎండిపోతున్నా, కనీసం రైతులకు భరోసా కల్పించిన దాఖలాలు లేవు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాపట్ల జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోని 92,119 మంది రైతుల తరఫున రూ. 174.18 కోట్ల క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించింది.


