కర్లపాలెం (బాపట్లటౌన్): రాయితీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎ.లక్ష్మి తెలిపారు. మండలంలోని దుండివారిపాలెంలో శుక్రవారం వ్యవసాయశాస్త్రవేత్తలు, అధికారుల బృందం పర్యటించింది. జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ వేరుశెనగ పంటలో జింక్, ఇనుము ధాతువుల లోపాలు ఉన్నాయన్నారు. వాటి నివారణకు ఫార్ములా–4, ఫార్ములా–6 సూక్ష్మ పోషకాలను ఎకరాకు 0.5 కిలో చప్పున పిచికారీ చేయాలన్నారు. దీనివల్ల పోషకాల లోపం తగ్గి, పంట ఏపుగా పెరుగుతుందన్నారు. నీటి ఎద్దడి కారణంగా వరిపంట ఎదుగుదల తగ్గిందన్నారు. బెట్ట పరిస్థితులను తట్టుకుని నిలబడేలా పొటాషియం నైట్రేట్ (13:0:45) మందును ఎకరాకు కిలో సాయంత్రం వేళలో పిచికారీ చేయాలన్నారు. ఇప్పటివరకు ఎలాంటి పంటలు వేయకుండా ఖాళీగా ఉన్న భూముల్లో ఆరుతడి పంటలైన మినుము, పెసర, రాగి, కొర్ర వంటి పంటలను సాగు చేయాలన్నారు. ప్రభుత్వం ఆరుతడి పంటల విత్తనాలపై 80శాతం రాయితీ ఇస్తుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రకృతి వ్యవసాయం మేనేజర్ మధుమోహన్, లాంఫాం శాస్త్రవేత్త డాక్టర్ గంగాదేవి, మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్, విస్తరణ అధికారి భాగ్యలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి ఎ.లక్ష్మి


