మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ
పర్చూరు(చినగంజాం): నియోజకవర్గ పరిధిలోని పర్చూరు, కారంచేడు, యద్దనపూడి మండలాల్లో రైతుల వద్ద మిగిలిపోయిన నల్లబర్లీ పొగాకు నిల్వలకు సంబంధించి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే విధంగా నివేదికను తయారుచేసి కలెక్టర్‌కు అందజేస్తానని మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ చెప్పారు. రైతుల వద్ద మిగిలిపోయిన పొగాకు నిల్వలను పరిశీలించే నిమిత్తం డీఎం శుక్రవారం పర్చూరు, నాగులపాలెంలో పర్యటించారు. పర్చూరు నియోజకవర్గంలోని మండలాల్లో రైతుల వద్ద మిగిలిపోయి నిల్వ ఉన్న పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు సంఘం, కౌలు రైతు సంఘం చేస్తున్న ఆందోళనలో భాగంగా సోమవారం గ్రీవెన్స్‌లో వివిధ గ్రామాల రైతులు రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఇచ్చిన ఆదేశాల మేరకు రైతుల వద్ద నిల్వ ఉన్న పొగాకు మండెలను పరిశీలించారు. పొగాకు ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా నివేదిక పంపడానికి అన్ని గ్రామాల వీఏఓలను రైతుల వారీగా పొగాకు నిల్వలను నివేదిక పంపాల్సిందిగా ఆదేశించారు. చిన్న, సన్నకారు రైతుల వద్ద గత సంవత్సరం నిల్వ ఉన్న పొగాకును కొనాలని రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆందోళన చేస్తున్న క్రమంలో డీఎం పరిశీలించారు. నాగులపాలెంలోని కౌలు రైతులు తమ వద్ద పొగాకు కొనుగోలు చేయలేదని పలుకుబడి గల రైతుల వద్ద నిల్వ ఉన్న పొగాకు మాత్రమే మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం ద్వారా అమ్ముడు పోయిందని తమ వద్ద పొగాకు మిగిలిపోయిందని, ఎండ, వానల నుంచి పొగాకు మండెలను కాపాడటం కష్టతరంగా ఉందని నాగులపాలెం కౌలు రైతులు డీఎంకి వివరించారు. పర్చూరు మండలంలో పొగాకు రైతుల వద్ద 53,110 క్వింటాళ్ల పొగాకు మిగులు ఉన్నట్లు వారు గుర్తించారు. నియోజక వర్గంలోని మిగతా మండలాల్లోని పొగాకు నిల్వలను సైతం గుర్తించి ప్రభుత్వానికి పొగాకు నిల్వల వివరాలను పంపి ప్రభుత్వం కొనుగోలు చేయడానికి కలెక్టర్ ద్వారా ప్రయత్నం చేస్తామని డీఎం కరుణశ్రీ అన్నారు. డీఎం వెంట మండల వ్యవసాయాధికారి భాస్కరరావు, ఏఈఓ శ్రీకాంత్, వ్యవసాయ సహాయకులు అగర్త, రైతు సంఘం సీనియర్ నాయకులు బండి శంకరయ్య, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.కొండయ్య, ఎం.మాణిక్యరావు, కూరాకుల రాజేష్, జొన్నలగడ్డ రాజారావు తదితరులు పాల్గొన్నారు.


