పేకాటలో తమ్ముళ్ల కాసుల వేట | - | Sakshi
Sakshi News home page

పేకాటలో తమ్ముళ్ల కాసుల వేట

Sep 12 2026 1:48 AM | Updated on Sep 12 2026 1:48 AM

పేకాటలో తమ్ముళ్ల కాసుల వేట

మంత్రి అండదండలతోనే..

కృష్ణా నది మధ్యలో యథేచ్ఛగా జూద శిబిరం

కుదేలవుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు

కనీసం కన్నెత్తి కూడా చూడని పోలీసులు

ఇతర జిల్లాల నుంచీ జూదరుల రాక

అక్కడే మందు, విందు వసతులు

టీడీపీ పాలనలో ధనార్జనే ధ్యేయంగా చెలరేగుతున్న నాయకులు

రేపల్లె: ప్రశాంతతకు మారుపేరైన రేపల్లె నియోజకవర్గం జూద క్రీడలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతుందన్న విమర్శలు రోజురోజుకీ తీవ్రం అవుతున్నాయి. స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అండదండలతో నియోజకవర్గం పేకాట మాఫియాకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణా నది తీరం వెంబడి రావి అనంతవరం సమీపంలో నది మధ్యలోనే దీవులలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలలో పగలు, రాత్రి తేడా లేకుండా జూద శిబిరాలు కొనసాగుతుండటం పరిస్థితి ఎంత దారుణంగా మారిందో స్పష్టం చేస్తోంది. రోజుకు రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలు కుదేలవుతున్నాయి.

టీడీపీ నేతల ధనార్జన

పట్టణంలోని డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఉప్పూడి గ్రామ సమీపంలో మరో పేకాట శిబిరం జోరుగా సాగుతోందని ప్రజలు బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలోని నిజాంపట్నం మండలం కొత్తపాలెం, నగరం మండలం వెలమవారిపాలెం గ్రామాలలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట దందా కొనసాగుతోంది. ఈ వ్యవహారాలు టీడీపీ నాయకుల అక్రమార్జనకు ఉదాహరణగా నిలుస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

క్యాసినో స్థాయిలో కేంద్రాలు

కృష్ణా నది మధ్యలో ఏర్పాటు చేసిన ఈ జూద శిబిరాల్లో టోకెన్‌ వ్యవస్థ, కట్టుదిట్టమైన భద్రత, బయటి వ్యక్తులకు ప్రవేశం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. కొన్ని చోట్ల క్యాసినో తరహాలో ఫుల్‌ సౌకర్యాలతో జూదం నిర్వహిస్తున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి సైతం పెద్ద ఎత్తున జూదరులు వస్తున్నారని సమాచారం. జూదరులను ఆకట్టుకునేలా శిబిరాల వద్దనే మందు, విందు, వసతి సౌకర్యాలు కల్పించడం ద్వారా టీడీపీ నేతలు తమ జేబులు నింపుకొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పేకాట మాఫియా వల్ల ఎన్నో కుటుంబాలు అప్పుల బారిన పడి కుదేలవుతున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ‘ఇంకెంతకాలం ఈ దందా?’ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మంత్రి అనగాని సత్యప్రసాద్‌, ఆయన సోదరుడు అనగాని శివప్రసాద్‌ ప్రోద్బలంతోనే ఈ పేకాట శిబిరాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు మారుమోగుతున్నాయి. శిబిరాల నుంచి అనగాని సోదరులకు రోజూ భారీగా కమీషన్‌లు చేరుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు చూస్తూ ఊరుకోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement