బాపట్ల: రాష్ట్రంలో రైతులు వర్షాలు లేక పంట ఎండిపోయి విలవిల్లాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మండిపడ్డారు. బాపట్ల నియోజకవర్గంలో రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ చేపట్టిన రైతు భరోసా పాదయాత్ర శుక్రవారం రెండో రోజు కర్లపాలెం మండలంలో సాగింది. రైతులను పరామర్శిస్తూ ఆయన ముందుకు సాగారు. తొలుత మహిళలు హారతులు ఇచ్చి కోనకు స్వాగతం పలికారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులను పట్టించుకోవడం చేతకాని అధికార పార్టీ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మరాజు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంట కాలువలు, మురుగు కాలువల అభివృద్ధిని పట్టించుకోలేదంటూ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను కోన ఖండించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురైన సమయంలో తాను సొంత నిధులతో మోటార్లు ఏర్పాటు చేసి నల్లమడ, తుంగభద్ర కాలువల నుంచి నీటిని తరలించినట్లు గుర్తుచేశారు. సంవత్సరంలో రెండు మూడు సార్లు నాటితే గానీ పంట పండని మూలపాలెం లాంటి పొలాలకు కూడా నీరు అందిందన్నారు. ఎమ్మెల్యే కూడా సొంత నిధులు వెచ్చించి రైతులకు సాగునీరు అందించేందుకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. విమర్శలు చేయడం కంటే రైతుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలని సూచించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో రైతుల తరఫున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పంట బీమాను చెల్లించారని, ఇప్పుడు ప్రతి రైతు ఎకరాకు రైతులే చెల్లించి పంట బీమా చేయించుకోవలసిన దుస్థితి నెలకొందన్నారు. సంపద సృష్టి పేరుతో రాష్ట్ర ప్రజలను పాలకులు మోసం చేశారన్నారు. సాగునీరు కూడా అందించకపోవడంతో రైతన్నలు ఆవేదనలో కూరుకుపోయారని చెప్పారు.
పింఛన్ల పేరుతో హడావుడి
స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజలను మళ్లీ మభ్యపెట్టడానికి పింఛన్ల పేరుతో ఈ కూటమి ప్రభుత్వం హడావుడి చేస్తుందని పేర్కొన్నారు. 50 ఏళ్లకు పింఛన్ పేరుతో అందరినీ మోసం చేసి, ఇప్పుడు దరఖాస్తుదారులను మీ సేవా కేంద్రాలకు, సచివాలయాలకు తిప్పుతున్నారన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. శుక్రవారం కర్లపాలెం మండలంలోని సత్యవతిపేట వద్ద నుంచి రెడ్డిపాలెం వరకు రైతు భరోసా పాదయాత్ర జరిగింది. 20 పంచాయతీల నుంచి రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. రైతులు సంఘీభావం తెలియజేస్తూ ఆయన వెంట నడిచారు. ఈ పాదయాత్రలో ఆయన వెంట పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు జి. సురేంద్రబాబు, మండల పార్టీ కన్వీనర్లు యల్లావుల ఏడుకొండలు, కాగిత సుధీర్‌బాబు, లీలా శ్రీనివాస్‌రెడ్డి, మరుప్రోలు ఏడుకొండలురెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి దొంతిబోయిన జయభరత్‌రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త పేరాల వెంకట సురేష్, మందపాటి పరమానంద కుమార్, యువజన అధ్యక్షులు సాగర్ బెనర్జీ, కోకి రాఘవరెడ్డి, వడ్డీముక్కల డేవిడ్, చల్లా రామయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చెంచయ్య, ట్రేడ్ యూనియన్ నాయకులు ఆట్ల నాగేశ్వరరెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.


