తమ్ముళ్ల కన్ను | - | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల కన్ను

Aug 15 2026 1:39 AM | Updated on Aug 15 2026 1:39 AM

తమ్ముళ్ల కన్ను బాధ్యులపై చర్యలు

యథేచ్ఛగా మట్టి తవ్వి తరలింపు దెబ్బతింటున్న కాల్వ కట్టలు పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు ఆందోళనలో అన్నదాతలు

కాల్వ కట్టలపైనా

పంట కాల్వలలో అక్రమంగా మట్టిని తవ్విన అంశం మా దృష్టికి వచ్చింది. విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పంట కాల్వలకు నష్టం చేకూర్చే విధంగా ఎటువంటి తవ్వకాలు చేయరాదు. ఎక్కడైన తవ్వకాలు జరిగితే స్థానికులు సమాచారం అందించాలి.

– విజయ్‌బాబు, ఇరిగేషన్‌ ఏఈ

నగరం: మండలంలోని పెదమట్లపూడి శివారు దాసరిపాలెంలో పంట కాల్వ మట్టిని పట్టపగలే అక్రమంగా జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. పంట కాల్వలతోపాటు మురుగు కాల్వల మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రేపల్లె ప్రధాన మురుగు కాల్వ (ఆర్‌ఎం డ్రెయిన్‌) ఓల్డ్‌ కోర్స్‌ కాల్వ కట్టల మట్టిని అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. పూడివాడ సమీపంలో మురుగు కాల్వ కట్టల మట్టిని అక్రమార్కులు తమ ఇష్టానుసారం తరలించుకుపోతున్నారు.

రేయింబవళ్లు తరలింపు

పట్టపగలు కాల్వ కట్టల మట్టిని జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నా ఎవ్వరూ స్పందించడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది రాత్రి సమయంలో ఎక్కడ పడితే అక్కడ కాల్వ కట్టల మట్టిని తరలిస్తున్నారు. మండలంలోని ధూళిపూడి, జిల్లేపల్లి, చినమట్లపూడి గ్రామాల్లో రాత్రివేళ ఈ దందా సాగుతోంది. శిరిపూడిలోనూ పంట కాల్వల మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారని రైతులు వాపోతున్నారు. కట్టలు బలహీనమై వర్షాల సమయంలో గండి పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి అభివృద్ధి పనులకు సైతం కాల్వ కట్టల మట్టిని వినియోగిస్తున్నారు. ఇటు పాలకులు గానీ, అటు అధికారులు గానీ స్పందించడం లేదు.

సొమ్ము చేసుకుంటున్న నాయకులు

మట్టి మాఫియాకు చెందిన కొంతమంది నాయకులు మురుగు కాల్వ కట్టల మట్టిని లక్ష్యంగా చేసుకున్నారు. మట్టి అవసరమైతే చాలు వెంటనే జేసీబీతో ఎక్కడ వీలు ఉంటే అక్కడ కట్టల మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. వీరికి అధికార పార్టీ నాయకులు తోడు కావడంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యవహారం సాగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. రహదారులు నిర్మించే చిన్న కాంట్రాక్టర్లు సైతం కాల్వ కట్టల మట్టిని తరలిస్తున్నారు. వాస్తవానికి వారు మట్టిని కొనుగోలు చేయాలి. ఈ మొత్తం పరిస్థితిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

టీడీపీ నేతల భూదాహానికి పంట, మురుగు కాల్వలు కూడా నాశనం అవుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ కాల్వల మట్టిని టీడీపీ నాయకులు అక్రమంగా తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎక్కడ మట్టి అవసరమైనా యథేచ్ఛగా తరలిస్తుండటంతో కాల్వ కట్టలు బలహీనమవుతున్నాయి. వానలు పడితే కాల్వలకు గండి పడే స్థాయిలో తవ్వకాలు ప్రమాదకరంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement