70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న సుగాలీలు ఫుడ్ పార్క్ పేరిట స్వాధీనానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నం న్యాయం చేయాలని జాతీయ ఎస్టీ కమిషనర్‌కు బాధితుల వినతి
మార్టూరు: గత మూడు తరాలుగా సాగు చేసుకుంటూ 100 కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న 80 ఎకరాల తమ భూములను ఫుడ్ పార్క్ పేరిట స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. మార్టూరు మండలం నాగరాజు పల్లి తండాకు చెందిన సుగాలీలు జాతీయ ఎస్టీ కమిషనర్ జాటోత్ హుస్సేన్ నాయక్‌కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఈ మేరకు వారు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి. నాగరాజు పల్లి తండాకు చెందిన సుమారు 100 కుటుంబాల వారు గ్రామంలోని సర్వే నెంబరు 500 లో 80 ఎకరాల భూమిని గత 70 సంవత్సరాలుగా బాగు చేసుకుని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ భూములు వీరి పేరిట ఆన్‌లైన్ కాగా గత ప్రభుత్వ హయాంలో వీరికి 1 బి, అడంగళ్, పాస్ పుస్తకాలు కూడా పొందిన అనంతరం బ్యాంకుల్లో రుణం సైతం తీసుకుంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఈ 80 ఎకరాల భూమిని ఫుడ్ పార్క్ కోసం అవసరమని ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సిందిగా జిల్లా అధికారులు పలుమార్లు తండాలో గ్రామసభలు నిర్వహించారు. గ్రామ సభల్లో తమకు జీవనాధారమైన భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇవ్వబోమని ఇదే గ్రామంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో పార్కు నిర్మాణం చేపట్టాలని.. తండావాసులు అధికారులకు స్పష్టం చేశారు. ఇటీవల వరకు ఎటువంటి ప్రయత్నాలు చేయని అధికారులు గత పది రోజులుగా తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు తిరిగి ప్రారంభిస్తున్నారనే వార్తల నేపథ్యంలో తండా పెద్దలు శుక్రవారం హైదరాబాద్‌లో ఎస్టీ కమిషనర్ హుస్సేన్ నాయక్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వీరి సమస్యను విన్న కమిషనర్ హుస్సేన్ నాయక్ తగు న్యాయం చేస్తానని తమకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. రమావత్ కళ్యాణ్ నాయక్, రమావత్ శ్రీను నాయక్, రమావత్ హనుమా నాయక్, రమావత్ బాబు నాయక్ ఉన్నారు.


