శ్రావణ మాసం తొలి శుక్రవారం రద్దీ ఆర్జిత సేవలకు డిమాండ్ మహా నివేదన తర్వాత పెరిగిన తాకిడి అంతరాలయ దర్శనం రద్దు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు దుర్గమ్మను దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. అమ్మవారికి నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఆరు గంటల నుంచే అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. మధ్యాహ్నం మహా నివేదన అనంతరం భక్తుల రద్దీ మరింత పెరగడంతో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి బంగారు వాకిలి ద్వారా దర్శనం కల్పించారు.
రెండు గంటలకు సుప్రభాతం
శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో అమ్మవారికి నిర్వహించే ఖడ్గమాలార్చనలో ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో సాధారణంగా రెండు షిఫ్టులలో జరిగే ఖడ్గమాలార్చన మూడు షిఫ్టులలో 50 మందికి పైగా ఉభయదాతలు పాల్గొన్నారు. శుక్రవారం రెండు గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ నిర్వహించారు. మరో వైపున ఆలయ ప్రాంగణంలోని నూతన పూజా మండపంలో లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చనతో పాటు శ్రావణ మాసం ప్రత్యేక కుంకు మార్చనకు భక్తుల నుంచి డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఆలయంలో ఆర్జిత సేవలను నిర్వహిస్తుండటంతో సర్వ దర్శనం క్యూలైన్‌లో మాత్రమే భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతించారు. దీంతో తెల్లవారుజామున నాలుగు గంటలకు క్యూలైన్లోకి చేరుకున్న భక్తులకు ఉదయం 7 గంటల తర్వాతే దర్శనం కలిగింది. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు మహామండపం రెండు, మొదటి అంతస్తులలో అన్నప్రసాదాన్ని అందజేశారు. ప్రధాన ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో విశేషంగా అలంకరించారు.


