న్యూస్‌రీల్
జిల్లా కలెక్టర్ దృష్టి సారిస్తేనే..
ఆరోగ్య కార్యక్రమాల అమలులో గుంటూరు, పల్నాడు వెనుకంజ
తనిఖీలు శూన్యం
రాజధాని జిల్లాలో పేదల వైద్యంపై చిన్నచూపు
విధులకు ఎక్కువమంది వైద్యులు డుమ్మా
ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్కువగా ప్రసవాలు
కనీస వైద్య పరీక్షలకు సైతం దిక్కులేని దయనీయ స్థితి
రాష్ట్రస్థాయిలో గుంటూరు జిల్లాకు 23, పల్నాడు జిల్లాకు 26 వ స్థానం
వైద్య ఆరోగ్యశాఖను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం
బాపట్ల
బుధవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతనీటి నిల్వ 28.7167 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 519.70 అడుగులకు చేరింది. జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 1,350 క్యూసెక్కులు విడుదలవుతోంది.
సాక్షిప్రతినిధి, గుంటూరు: జిల్లాలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో పీహెచ్‌సీల్లో ప్రసవాలు, వైద్య పరీక్షలు, ఓపీ, ఐపీ సేవలు బ్రహ్మాండంగా నిర్వహించేవారు. అప్పట్లో ఏ వ్యవహారం తీసుకున్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మొదటి ఐదు స్థానాల్లో నిలిచేది. అంతర్జాతీయ రాజధాని నిర్మిస్తానంటూ బీరాలు పలుకుతున్న కూటమి ప్రభుత్వం పేదలకు కనీస వైద్య సేవలు అందించలేని దుర్భర స్థితిలోకి వైద్య ఆరోగ్య శాఖను నెడుతోంది. వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలులో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండాల్సిన రాజధాని జిల్లా 23, పల్నాడు జిల్లా 26 స్థానాలకు పడిపోయిన పరిస్థితి చూస్తుంటే పేదల వైద్యంపై కూటమి ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ఇదేదో ఒక నెల పనితీరు అనుకుంటే పొరపాటే. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు దారుణంగా పడిపోయింది.
పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయని వైనం
ఒకప్పుడు పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు చేసేలా ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో పరిశీలన జరుపుతూ, ప్రతినెలా ఆయా పీహెచ్‌సీల పనితీరును పర్యవేక్షిస్తూ వచ్చేది. దీంతో ఆసుపత్రి ప్రసవాలు పెరిగి, సిజేరియన్లు బాగా తగ్గాయి. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయకపోవడంతో నిరుపేదలు సైతం చేసేది లేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో 90 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. ఒక్కో ఆపరేషన్‌కు రూ. లక్ష వరకు ఖర్చు అవుతుండటంతో అంత ఖర్చు భరించలేక పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే, ఇక మారుమూల జిల్లాల పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు.
వైద్యులు లేక.. వైద్య పరీక్షలు చేయక
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని పీహెచ్‌సీలను 24 గంటల ఆసుపత్రులుగా మార్చేశారు. ప్రతి పీహెచ్‌సీకి ముగ్గురు చొప్పున వైద్యులను నియమించడంతోపాటు, 24 గంటలూ అందుబాటులో ఉండేలా ముగ్గురు స్టాఫ్ నర్సులను, నైట్ వాచ్‌మెన్ విధుల నిర్వహణకు కింది స్థాయి సిబ్బందిని సైతం నియమించారు. ఆసుపత్రుల్లో 24 గంటలూ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించేలా పర్యవేక్షణ అధికారులను సైతం నియమించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఆరోగ్యంపై నిర్లక్ష్య ధోరణితో ఉంది. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. రాత్రి వేళల్లో అలంకారప్రాయంగా ఆరోగ్య కేంద్రాలు తెరిచి ఉంటున్నాయి తప్ప, వైద్య సేవలు అందించేందుకు ఎవరూ ఉండటం లేదు. పట్టపగలే వైద్యులు విధులకు డుమ్మా కొడుతున్నారు. ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు ఉన్నప్పటికీ, దాన్ని తమ ఇళ్ల వద్దే ఉండి ఆరోగ్య కేంద్రంలో ఉన్నట్లుగా హాజరు వేస్తూ విధులకు డుమ్మా కొట్టి సొంత ప్రాక్టీస్‌ల్లో మునిగితేలుతున్నారు.
పేద ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య కేంద్రాల్లో పటిష్టమైన వైద్య వ్యవస్థ పనిచేసేలా జిల్లా కలెక్టర్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వైద్య అధికారులు తనిఖీలు చేయకపోవడంతో ఆరోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. జిల్లా హెడ్‌క్వార్టర్‌లో నివాసం ఉంటూ గ్రామీణ ప్రాంతాలకు విధులకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నవారిపై దృష్టి సారిస్తే పేద రోగులకు వైద్య సేవలు అందే అవకాశం ఉంది. పలు ఆరోగ్య కేంద్రాలకు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, వాటిని కాగితాల్లో లెక్కలు చూపించి వైద్య అధికారులు దిగమింగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఆరోగ్య కేంద్రాలకు ఇస్తున్న నిధులతో ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశాలు ఉన్నా, వాటిని వైద్య అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
రాజధాని జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అనారోగ్యం పాలైంది. వైద్య ఆరోగ్య రంగంలో ముందుండాల్సిన జిల్లా పాతాళానికి పడిపోతోంది. ప్రైవేటు రంగంలో కార్పొరేట్ ఆసుపత్రులను ప్రారంభించేందుకు వస్తున్న సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస వసతులు కల్పించడం లేదు. దీంతో పేదలకు వైద్యం దూరం అవుతోంది. వసతుల లేమికి తోడు వైద్యుల నిర్లక్ష్యం పెరిగింది. రాష్ట్రస్థాయి ర్యాంకు చూస్తే ఈ దుస్థితి అర్థమవుతోంది. పక్కనే ఉన్న పల్నాడు జిల్లాలోనూ ఇదే దయనీయ పరిస్థితి నెలకొంది.
ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించాల్సిన డీఎంహెచ్‌ఓ, ప్రోగ్రామ్ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. అందువల్లే ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు సేవలందించకుండా సొంత వ్యవహారాల్లో మునిగిపోతున్నారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జిల్లా వైద్య అధికారులు కొంతసేపు ఫైళ్లను తనిఖీ చేసి, అనంతరం కార్యాలయంలో ఉండకుండా సొంత వ్యవహారాల్లో నిమగ్నం అవుతున్నారు. జిల్లా మలేరియా అధికారి పనితీరుపై ఉద్యోగ సంఘాల నేతలు ఏకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎయిడ్స్, లెప్రసీ అధికారి సైతం తన పరిధిలోని ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేయాల్సి ఉంది. కానీ సదరు అధికారి రూ. లక్షలు తీసుకుంటూ అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. సదరు అధికారిపై జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినప్పటికీ చర్యలు లేవు. దీంతో ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది విధులకు దూరంగా ఉంటూ గ్రామీణ పేద రోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా నిర్వహిస్తున్న ఆరోగ్య కేంద్రాల పనితీరులో గుంటూరు జిల్లా పనితీరు చివరి స్థానంలో ఉండటం ఇక్కడి అధికారులు, వైద్య సిబ్బంది పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.


