ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
కొరిటెపాడు(గుంటూరు): వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు సర్కిల్ పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితి, నష్టాల నియంత్రణ, వినియోగదారుల సేవలపై మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమగ్ర సమీక్ష నిర్వహించారు. గుంటూరు సర్కిల్ పరిధిలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, 11 కేవీ ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. సీఎండీ పుల్లారెడ్డి మాట్లాడుతూ అధిక లోడ్ ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి లోడ్ బ్యాలెన్సింగ్ చేయడంతోపాటు అవసరమైన చోట అదనపు సామర్థ్యం కల్పించాలని ఆదేశించారు. సర్కిల్ పరిధిలో విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అధిక నష్టాలు నమోదవుతున్న ఫీడర్లను గుర్తించి వాటి కారణాలను విశ్లేషించాలన్నారు. సాంకేతిక, పరిపాలనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని సూచించారు. టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్టు డైరెక్టర్ టీవీఎస్‌ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, గుంటూరు సర్కిల్ ఎస్‌ఈ చల్లా రమేష్, ఈఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో నిరుపయోగంగా ఉన్న బంగారు ఆభరణాలను గోల్డ్ బాండ్ స్కీమ్ కింద విజయవాడ ఎంఎంటీసీకి అప్పగించారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో తిరుపతి మల్టీ జోన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ బొంతు మహేశ్వరరెడ్డి, గుంటూరు ఆభరణాల తనిఖీ అధికారి సైదమ్మ బాయ్, ఆలయ ఈవో డి.చంద్రశేఖర రావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆలయానికి చెందిన నిరుపయోగంగా ఉన్న సుమారు కిలోకి పైగా బంగారు ఆభరణాలను గోల్డ్‌బాండ్ స్కీమ్‌లోకి మార్చే ప్రక్రియలో భాగంగా ఎంఎంటీసీకి అప్పగించినట్టు ఈవో తెలిపారు. వినియోగంలో లేని బంగారు ఆభరణాలను గోల్డ్ బాండ్ రూపంలో పెట్టుబడిగా మార్చడం ద్వారా ఆలయానికి ఆదాయం లభిస్తుందని తెలిపారు.
తాడికొండ: రాయపూడి పరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర దిన వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, వేదిక నిర్మాణం, ప్రజల సౌకర్యాలు తదితర అంశాలపై మంగళవారం ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధ్యక్షత వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో సమగ్ర భద్రతా ఏర్పాట్లలో భాగంగా ప్రాంగణంలో క్రౌడ్ మేనేజ్‌మెంట్, బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ నిర్వహణ తదితర అంశాలపై అధికారులు చర్చించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్, ఆర్డీవో, ఎస్బీ డీఎస్పీ, ఏపీ రాష్ట్ర ప్రొటోకాల్ డైరెక్టర్, తుళ్లూరు పోలీస్, ట్రాఫిక్ అధికారులు, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.


