జీజీహెచ్‌లో ఎలుకలు.. గుండె వైద్య పరీక్షలకు చిక్కులు | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో ఎలుకలు.. గుండె వైద్య పరీక్షలకు చిక్కులు

Aug 12 2026 1:28 AM | Updated on Aug 12 2026 1:28 AM

జీజీహెచ్‌లో ఎలుకలు.. గుండె వైద్య పరీక్షలకు చిక్కులు

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లోని గుండె జబ్బుల వైద్య విభాగంలో 2డీ ఎకో మిషన్‌ వైర్లను ఎలుకలు కొరికాయి. దీంతో కొద్దిరోజులుగా ఇన్‌పేషెంట్‌ విభాగంలోని రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో రోజూ పది నుంచి 15 వరకు ఎలుకలు పట్టుబడుతున్నాయి. ఓపీ విభాగాల్లో, వార్డుల్లో అవి సంచరిస్తున్నాయి. తాజాగా గుండె జబ్బుల విభాగంలో వైద్య పరికరాలపై దాడి చేశాయి. మూషికాలు, ఇతర క్రిమికీటకాల నియంత్రణకు కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం నెలకు రూ.3 లక్షలకు పైగా చెల్లిస్తోంది. ఆసుపత్రి చుట్టుపక్కల అపరిశుభ్రమైన వాతావరణం ఉండటంతో ఎలుకలు ప్రవేశిస్తున్నాయి. గతంలో మూషికాలు లోపలకు రాకుండా మెష్‌ డోర్లు ఏర్పాటు చేశారు. వార్డుల్లోకి సైతం ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నారు. కాలక్రమేణా కాంట్రాక్టర్‌ మూషికాల నియంత్రణపై దృష్టి తగ్గించడంతో సమస్య తీవ్రంగా మారింది.

గతంలోనూ...

ఆసుపత్రిలో ఎలుకల దాడిలో పసికందు మృతిచెందిన సంఘటన 2015లో చోటుచేసుకుంది. నాటి సంఘటనతో దేశవ్యాప్తంగా జీజీహెచ్‌ పరువు మంటగలిసింది. ప్రతిష్ఠను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నంలో నాటి ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ జీజీహెచ్‌లో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నారు. నాటి నుంచి పెస్ట్‌ కంట్రోల్‌కు ప్రత్యేకంగా ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించి, ఎలుకల కట్టడికి చర్యలు ప్రారంభించింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.దుర్గాప్రసాద్‌ ఈ విషయంపై పెస్ట్‌ కంట్రోల్‌ సిబ్బందితో మాట్లాడారు. వైద్య పరికరం మరమ్మతులకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కాంట్రాక్టర్‌ చెల్లించాలని ఆదేశించారు. వార్డులో రోగులు ఇబ్బంది పడకుండా ఓపీలో ఉన్న వైద్య పరికరంతో వైద్య పరీక్షలు చేస్తున్నట్లు కార్డియాలజిస్టులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement