విమానాశ్రయం ఏర్పాటుపై మొదటి ప్రతిపాదన మాదే
పాండురంగాపురం రోడ్డు నిర్మాణానికీ ప్రతిపాదించాం
నేడు ప్రగతి పేరుతో సూర్యలంకలో
అస్తవ్యస్తంగా పనులు
మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
నేడు స్పష్టత ఏదీ?
బాపట్ల: సూర్యలంక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సూచించారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రతిపాదనల వలనే తాజాగా నిధులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. మంగళవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోన రఘుపతి మాట్లాడారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటూ పోవటం వలననే ఆశించిన మేరకు పనులు జరిగాయని పేర్కొన్నారు. సూర్యలంక కేంద్రంగా అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో పనులు చేపట్టామని చెప్పారు. సంక్రాంతి సంబరాలకు రూ.కోటి విడుదల చేస్తే, ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేశామన్నారు. అందుకే ఈ రోజు ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనాలు సముద్రం వరకు వెళ్లగలుగుతున్నాయని చెప్పారు.
విమానాశ్రయ ప్రతిపాదన
సూర్యలంక కేంద్రంగా అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో ముందుకు సాగినట్లు కోన తెలిపారు. ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ఉన్న విమానాశ్రయంలో 1,000 ఎకరాలు ఉండగా, వాటిలో 350 ఎకరాలు విమానాశ్రయానికి వినియోగించుకుని, బయట నుంచి నిరుపయోగంగా ఉన్న మరో 350 ఎకరాలు తీసుకుని విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని చెప్పారు. సూర్యలంక అభివృద్ధి, పాండురంగాపురం రోడ్డు నిర్మాణానికి రూ.134 కోట్లు నిధులకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. సూర్యలంకకు రూ.100 కోట్లు కేటాయించాలని సూచించామని తెలిపారు. సూర్యలంక పొరుగు నుంచి ఎయిర్‌ఫోర్స్ గోడకు ఉత్తరం వైపు ఒక పెద్ద కాలువ తవ్వించటం వలన మత్స్యకారులకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని ప్రతిపాదించామన్నారు. అంతేకాకుండా సూర్యలంకలో పర్యాటకం అభివృద్ధి కోసం చిలుకల పార్కు, జూ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. తనకు ఉన్న పరిచయాలతో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రతిపాదనలు తయారు చేసి, ఆమోదముద్ర వేయించామని చెప్పారు.
సూర్యలంకలో ప్రస్తుతం చేపట్టిన నిర్మాణ పనుల్లో అక్కడ 50, 60 సంవత్సరాల నుంచి జీవనాధారంగా ఉన్న మత్స్యకారులకు శాశ్వత పరిష్కారానికి ఏ విధంగా అనుసరిస్తారో అనే విషయంపై ఎక్కడా స్పష్టత లేదన్నారు. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న షాపుల్లో వారికి అవకాశం కల్పిస్తారా? లేదా? అనేది అర్థం కావటం లేదన్నారు. అధికారం శాశ్వతం కాదని, అధికారం వచ్చినప్పుడు ప్రాంతీయ అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని కోన సూచించారు. అభివృద్ధి విషయంలో ఎప్పుడైనా తన వంతు సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, గవిని కృష్ణమూర్తి, వడ్డిముక్కల డేవిడ్, కొక్కిలిగడ్డ చెంచయ్య, ఇనగలూరి మాల్యాద్రి, అడే చందు, ఆట్ల ప్రసాదరెడ్డి, సమ్మెట వెంకటేశ్వరరెడ్డి, మచ్చా శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.


