హరే రామ.. హరే కృష్ణా..! | - | Sakshi
Sakshi News home page

హరే రామ.. హరే కృష్ణా..!

Jul 17 2026 3:10 AM | Updated on Jul 17 2026 3:10 AM

హరే రామ.. హరే కృష్ణా..! గుంటూరులో వైభవంగా జగన్నాథ రథయాత్ర

గుంటూరులో వైభవంగా జగన్నాథ రథయాత్ర

నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌): గుంటూరు నగర పుర వీధుల్లో జగన్నాథ రథయాత్ర వైభవంగా కొనసాగింది. హరేకృష్ణ నామ సంకీర్తనతో వీధులన్నీ మార్మోగాయి. స్వామినామంతో భక్తులు పులకించిపోయారు. గుంటూరు ఏటీ అగ్రహారం పరిధిలోని మల్లారెడ్డినగర్‌లో ఇస్కాన్‌ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్‌) ఆధ్వర్యంలో గురువారం జగన్నాథుని రథయాత్ర భక్తిశ్రద్ధలతో సాగింది. భక్తులు భారీగా తరలివచ్చి, హరే రామ, హరేకృష్ణ నామ సంకీర్తనల ఆలాపనతోపాటు కోలాటం, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. యాత్ర మిర్చియార్డు, కలెక్టరేట్‌రోడ్డు, కంకగుంట రైల్వే ఫ్లై ఓవర్‌, పట్టాభిపురం, కుందుల రోడ్డు, బృందావన్‌గార్డెన్స్‌, లక్ష్మీపురం, కొరిటెపాడు మీదగా చంద్రమౌళినగర్‌ మాజేటి కల్యాణ మండపం వద్దకు చేరుకుంది. అనంతరం స్వామివారికి మంగళహారతి. మహాప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జగన్నాథ రథయాత్రకు హాజరై నామస్మరణ చేయడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తాయని తెలిపారు.

● అదేవిధంగా గుంటూరు తూర్పు పరిధిలో గురువారం రాత్రి శ్రీజగన్నాథస్వామి రథయాత్రను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. కొత్తపేట పశువుల ఆసుపత్రి ఎదురు శ్రీజగన్నాథ స్వామి వారి దేవస్థానంలో శ్రీబాలభద్ర సుభద్ర శ్రీజగన్నాథస్వామి వారి రథయాత్ర వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. గుంటూరు నగరంలో నివసించే ఒడిశా రాష్ట్ర భక్తులు తరలివచ్చి, స్వామి వారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement