తెనాలిరూరల్: ఆస్తి వివాదం చినికి చినికి గాలివానగా మారి ఘర్షణకు దారితీసింది. వేధింపులతో విసిగి వేసారారో లేక తట్టుకోలేకపోయారో గానీ ఆ కుటుంబ సభ్యుల పరస్పర ఘర్షణలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో కలకలం రేపిన ఘటనపై పట్టణ వన్‌టౌన్ సీఐ ిసీహెచ్ రాంబాబు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక నాజరుపేటలో నివాసం ఉండి, ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించే కొల్లిపర కోటేశ్వరరావు(28)కు కొంతకాలంగా తల్లిదండ్రులతో ఆస్తి వివాదం జరుగుతోంది. కొల్లిపరలో ఉన్న నివేశన స్థలాన్ని అమ్మి తనకు కొంత డబ్బు ఇవ్వాల్సిందిగా తల్లిదండ్రులు భాస్కరరావు, విజయమ్మ, తమ్ముడు మరియదాసులపై కోటేశ్వరరావు ఒత్తిడి తెస్తుండడంతో పాటు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి వరకు పరస్పరం వాదనలు, ఘర్షణ జరిగాయి. ఘర్షణలో తల్లిదండ్రులు సోదరుడు మరియదాసు చేతిలో తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని మూటలో పెట్టి ఆటోలో తరలించే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు గమనించి డయల్ 112 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐతో పాటు సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేసి....
కోటేశ్వరరావు డబ్బు కోసం తల్లిదండ్రులను తీవ్రంగా వేధింపులకు గురి చేసేవాడని తెలుస్తోంది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి తెచ్చిన డబ్బును జల్సాల కోసం ఖర్చు చేసేవాడు. వివిధ రకాల పనులు చేసి తమ్ముడు కూడబెట్టిన సుమారు రూ.5 లక్షల వరకు సొమ్మునూ ఖర్చు చేశాడు. వేమూరు మండలం చదలవాడ గ్రామానికి చెందిన మహిళతో కోటేశ్వరరావుకు వివాహం కాగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. విభేదాల కారణంగా ఏడేళ్ల క్రితం భార్యతో విడిపోయాడు. కొందరు మహిళలతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకుని కుటుంబ సభ్యుల సంపాదనంతా వారికి ఖర్చు చేస్తుండడంతో తండ్రి భాస్కరరావు, తల్లి విజయమ్మ నాజరుపేట ఇంద్ర టవర్స్ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డుకు మకాం మార్చారు. వీరితో కలిసి ఉంటున్న కోటేశ్వరరావు ఆటో నడుపుతూ తన జల్సాలను మాత్రం మానుకోలేదు. డబ్బు కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తీవ్రతరం చేశాడు. భాస్కరరావు బుధవారం కొల్లిపర వెళ్లి తమ బంధువులతో ఇంటి స్థలం విక్రయించాలని, బేరం త్వరగా చూడాలని కోరి, తమ పెద్ద కొడుకు వేధింపులు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వేధింపులు తాళ లేక హతమార్చి ఉంటారని బంధువులు చెబుతున్నారు.
ఆటోలో ఉన్న
కోటేశ్వరరావు మృతదేహం
కొల్లిపర
కోటేశ్వరరావు(ఫైల్)
తల్లిదండ్రులు, తమ్ముడే
అంతమొందించారని ఆరోపణలు


