● 16 ట్రాన్స్‌ఫార్మర్లలో రూ. 1.50 లక్షల
విలువైన 105 కిలోల వైరు చోరీ
● పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
నరసరావుపేట టౌన్: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి అందులోని రాగి తీగలను అపహరిస్తున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు పల్నాడు జిల్లా అడ్మిన్ ఎస్పీ జె.వి.సంతోష్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నకరికల్లు మండలం కండ్లగుంట, నరసింగపాడు గ్రామాల పరిధిలో ఇటీవల వరుసగా ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి అందులో విలువైన రాగితీగలను చోరీలకు పాల్పడుతున్న కేసులను డీఎస్పీ ఎం. హనుమంతరావు ఆధ్వర్యంలో నకరికల్లు పోలీసులు ఛేదించారన్నారు. కండ్లగుంట గ్రామానికి చెందిన చండ్రా వెంకటేశ్వర్లు తన పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం చేసి రాగి వైర్లను దొంగలించినట్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. బుధవారం చేజర్ల గ్రామ సమీపంలో ఎన్‌ఎస్పీ కుడి కాల్వ దగ్గర నకరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన తడపాల సాయిబాబు, ఉరాలశెట్టి మల్లయ్య, చలంచర్ల హనుమంతరావులు అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని, విచారించగా.. రాగివైర్లు దొంగతనానికి పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారన్నారు. నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో 16 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి అందులో విలువైన కాపర్ వైర్లను అపహరించినట్లు తేలిందన్నారు. కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మాచర్ల టౌన్‌కు చెందిన రాజు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.1.50 లక్షల విలువైన 105 కేజీల రాగి వైరును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ హనుమంతరావు, సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్, నకరికల్లు ఎస్‌ఐ సతీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


