డాక్టర్ పమిడిముక్కల విజయకు అంతర్జాతీయ గుర్తింపు వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ డైరెక్టర్‌గా నియామకం దక్షిణాది రాష్ట్రాల్లో మొట్టమొదటి వైద్యురాలిగా గుర్తింపు
గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన సీనియర్ న్యూరాలజిస్ట్, లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పమిడిముక్కల విజయ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 18 మంది వైద్యులను మాత్రమే ఎంపిక చేసే వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్‌కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఎంపికై రికార్డు సృష్టించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్‌కు ఎంపికై న మొట్టమొదటి వ్యక్తిగా డాక్టర్ విజయ రికార్డు సృష్టించారు. బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు అందిస్తున్న చికిత్సలకు, పక్షవాత బారిన పడకుండా ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలకు, బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సల్లో వైద్యులు, సిబ్బందికి లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన అంకినీడు స్ట్రోక్ సెంటర్ ద్వారా అందిస్తున్న అత్యుతన్నత వైద్య ప్రమాణాలకు అంతర్జాతీయ గౌరవం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలిగా ఆమె పనిచేసి రికార్డు సృష్టించారు.
1996 నుంచి సేవలు
ఉమ్మడి ఏపీలోనే మొట్టమొదటిగా, దేశంలో రెండవదిగా 1996లో గుంటూరులో అంకినీడు స్ట్రోక్ సెంటర్‌ను డాక్టర్ విజయ ఏర్పాటు చేశారు. పక్షవాత ( బ్రెయిన్ స్ట్రోక్) చికిత్సలో అత్యున్నత ప్రమాణాలు, నాణ్యమైన వైద్యసేవలు అందించటంలో అంకినీడు స్ట్రోక్ సెంటర్ చూపుతున్న నిరంతర కృషికి గాను ఇటీవల జాతీయ అవార్డు లభించింది. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఏజెంల్స్ ఇనిస్టిట్యూట్ డైమండ్ స్టేటస్ అంతర్జాతీయ అవార్డు స్ట్రోక్ సెంటర్‌కు, డాక్టర్ విజయకు 2020 నుంచి 2025 వరకు వరుసగా ఐదుసార్లు లభించింది.
తాత మరణం కలచివేసింది..
ఈ సందర్భంగా డాక్టర్ పి.విజయ ‘సాక్షి’తో మాట్లాడుతూ నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో తాత అంకినీడుకు పక్షవాతం వచ్చి సకాలంలో చికిత్స ఎక్కడా లభించక చనిపోయారని, కళ్లెదుటే ఆయన మరణం చూసి తట్టుకోలేక బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు నివారించాలని మనస్సులో గట్టిగా నిర్ణయించుకున్నానని తెలిపారు. తదనుగుణంగా న్యూరాలజిస్ట్‌గా సేవలు ప్రారంభించానని తెలిపారు. ఉమ్మడి ఏపీలోనే మొట్టమొదటిగా, దేశంలో రెండవదిగా మా తాత అంకినీడు పేరు మీదుగా 1996లో గుంటూరులో పక్షవాత మరణాలు నివారణే లక్ష్యంగా స్ట్రోక్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు.
అంకినీడు స్ట్రోక్ సెంటర్ డైరక్టర్‌గా ఉన్న తాను ప్రతినెలా 100 నుంచి 125 మంది స్ట్రోక్ బాధితులకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వరల్డ్ స్ట్రోక్ అసోసియేషన్‌కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఎంపికవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి స్ట్రోక్ మరణాలు తగ్గింపే లక్ష్యంగా చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ఇచ్చిన పదవికి దేశానికి గుర్తింపు వచ్చేలా పనిచేస్తానని తెలిపారు.
కుటుంబమంతా వైద్యులే..
డాక్టర్ విజయ భర్త పి. వి.రాఘవశర్మ సీనియర్ కార్డియాలజిస్టుగా, కార్డియాలజీ వైద్యుల సంఘం రాష్ట్ర నాయకుడిగా సేవలందిస్తున్నారు. పెద్దకుమారుడు డాక్టర్ అనురాగ్ కార్డియాజిస్ట్‌గా, పెద్ద కోడలు డాక్టర్ స్రవంతి క్యాన్సర్ వైద్య నిపుణులుగా చిన్న కుమారుడు డాక్టర్ నరేన్ న్యూరాలజిస్ట్‌గా, చిన్న కోడలు డాక్టర్ సిరి చందన నెఫ్రాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. సీనియర్ న్యూరాలజిస్టుగా, స్ట్రోక్ స్పెషలిస్టుగా 35 సంవత్సరాలుగా డాక్టర్ విజయ సేవలందిస్తూ ఎన్నో అవార్డులు, సన్మానాలు పొందారు. నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ (యూఎస్‌ఏ), వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎస్‌ఓ), అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ (ఏఏఎన్), యూరోపియన్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (ఈఎస్‌ఓ), ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ (ఏపీఎన్‌ఎస్‌ఏ), న్యూరలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.


