స్టీరింగ్‌ వదిలి.. కంచం పట్టి | - | Sakshi
Sakshi News home page

స్టీరింగ్‌ వదిలి.. కంచం పట్టి

Jul 17 2026 3:10 AM | Updated on Jul 17 2026 3:10 AM

● ఖాళీ కంచాలతో బిక్షాటన చేస్తూ వినూత్న నిరసన ● సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం ● జీతాల పెంపు కోసం మూడో రోజూ హైర్‌ బస్‌ డ్రైవర్ల సమ్మె

రేపల్లె: స్టీరింగ్‌ పట్టి ప్రయాణికులను గమ్యానికి చేర్చే చేతులు.. గురువారం ఖాళీ కంచాలు పట్టి వీధుల్లోకి వచ్చాయి. జీతాల పెంపు, కార్మిక హక్కుల అమలు కోసం సమ్మె చేస్తున్న హైర్‌ బస్సు డ్రైవర్లు వినూత్నంగా బిక్షాటన చేపట్టి తమ ఆవేదనను చాటుకున్నారు. రేపల్లె ఆర్టీసీ డిపో నుంచి ప్రధాన రహదారి వరకు ఖాళీ కంచాలతో నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. స్థానిక కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా డ్రైవర్ల పోరాటానికి సంఘీభావం ప్రకటించాయి. జీతాల పెంపుదలతో పాటు కార్మిక హక్కుల అమలు కోరుతూ రేపల్లె, చీరాల డిపోల పరిధిలో హైర్‌ (అద్దె) బస్‌ డ్రైవర్లు చేపట్టిన సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటీయూ బాపట్ల జిల్లా కోశాధికారి సీహెచ్‌ మణిలాల్‌ మాట్లాడుతూ రేపల్లె డిపో పరిధిలో ప్రతి రెండేళ్లకు ఒకసారి వేతనాల సవరణ జరుగుతుందన్నారు. రెండు సంవత్సరాల క్రితం రోజువారీ వేతనం రూ.1,000 ఉండగా కేవలం రూ.100 మాత్రమే పెంచి ప్రస్తుతం రూ.1,100 చెల్లిస్తున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు, ఇతర వ్యయాలు భారీగా పెరిగినా హైర్‌ బస్‌ యజమానులు వేతనాల పెంపుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఆర్టీసీ అధికారులు జోక్యం చేసుకోవాలి

ఆర్టీసీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి డ్రైవర్‌కు కనీస వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, బోనస్‌ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పిస్తామని హైర్‌ బస్‌ యజమానులు హామీ ఇచ్చినా వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. ఆర్టీసీ అధికారులు జోక్యం చేసుకుని ఒప్పందాలను అమలు చేయించే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సమ్మెకు మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికులు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు వై.కిషోర్‌, కొప్పుల గోపి, ఎన్‌.రవి, పి.విజయ్‌ తదితరులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మదర్‌ థెరిసా హైర్‌ బస్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు, కోశాధికారి జి.రవిబాబు, నాగరాజు, వెంకటేశ్వరరావు, రాజు, ఇమ్రాన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement