వినుకొండ: వినుకొండ పట్టణంలో గురువారం ఒకే రోజు నాలుగు ఇళ్లలో వరుస దొంగతనాలు జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దొంగలు పట్టపగలే తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బీరువాలు పగలగొట్టి, భారీగా నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. స్థానిక కొత్తపేట ఐదో లైను, ట్రాన్‌న్స్‌ఫార్మర్ బజారుతో పాటు, కాలువ కట్టపై ఉన్న రెడ్డి నగర్ సమీపంలోని మూడు ఇళ్లలో ఈ చోరీలు జరిగాయి. కొత్తపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆవుల సుబ్బారెడ్డి ఇంట్లోకి చొరబడిన దొంగలు, బీరువా తాళాలు పగలగొట్టి సుమారు పది తులాల బంగారం, లక్ష రూపాయల నగదును అపహరించుకుపోయారు.మరో మూడు ఇళ్లలోనూ దొంగలు అదే పద్ధతిలో తాళాలు, బీరువాలు పగలగొట్టి విలువైన వస్తువుల కోసం వెతికారు. ఇళ్లలోని సామాన్లను, బట్టలను గదుల నిండా చెల్లాచెదురుగా పడేశారు. ఆ ఇళ్లలో జరిగిన నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే రోజు, అది కూడా పట్టపగలే నాలుగు ఇళ్లలో దొంగతనాలు జరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
రంగంలోకి దిగిన పోలీసులు
సమాచారం అందుకున్న వెంటనే వినుకొండ పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకున్నారు. దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించి, వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దించి దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఒకే రోజు నాలుగు ఇళ్లలో చోరీ!


